ఉద్యమం–ఉప ఎన్నికలు

Five Seats In Siddipeta By Election - Sakshi

సిద్దిపేటలో ఐదు పర్యాయాలు ఉప ఎన్నికలు

తెలంగాణ కోసమే నాలుగు సార్లు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:   సిద్దిపేట.. 1969 నాటి నుంచి తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ.. రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఉప ఎన్నికల్లో గెలవడం.. ఇక్కడ ఓటర్లకు చర్వితచర్వణం.. 1969 ఉద్యమ సమయంలో సిద్దిపేట ఎమ్మెల్యే, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఉన్న వీబీ రాజీనామా చేశారు. అనంతరం 1970లో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ ప్రజా సమితి వ్యవస్థాపకుల్లో ఒకరైన అనంతుల మదన్‌ మోహన్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

రాష్ట్ర సాధన కోసం 2001లోనూ చరిత్ర మరోమారు పునరావృతమైంది. టీడీపీ తరపున సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్‌ 2001లో తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్తాపకులైన కేసీఆర్‌ 2001 ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మలి విడత తెలంగాణ ఉద్యమంలో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన తన్నీరు హరీష్‌రావు 2008, 2010లోనూ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికయ్యారు.

1952లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి 2014 వరకు సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ఇప్పటి వరకు 19 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా, ఐదుమార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగు ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఇక్కడి ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో జరిగినవే కావడం గమనార్హం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top