చిన్న రైతుకే తొలి సాయం!

First aid Raithu Bandhu to a Small Range Farmer - Sakshi

ప్రాథమికంగా నిర్ణయించిన వ్యవసాయ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: పెట్టుబడి సాయాన్ని తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ముందుగా ఇవ్వాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. పట్టాదారుల వివరాలను ఏఈఓలు నమోదు చేసిన వెంటనే చిన్న కమతాల నుంచి మొదలుపెట్టి పెద్ద కమతాల రైతులకు రైతుబంధు సొమ్మును జమ చేయనుంది. సీసీఎల్‌ఏ ఇప్పటికే జనవరి వరకు డిజిటల్‌ సంతకాలు అయిన పట్టాదారుల వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖకు సమర్పించింది. ఇందులో 59.30 లక్షల మంది పట్టాదారులుండగా, వీరికి 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణం ఉంది. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతుల సంఖ్య, విస్తీర్ణం కలిపితే ఈ మొత్తం మరింత పెరుగుతుంది.

సీసీఎల్‌ఏ ఇచ్చిన సమాచారంలో దాదాపు 8 లక్షల మంది రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు లేవు. ప్రస్తుతం వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో వీటిని సేకరించే పనిలోఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ముగియనున్నట్లు తెలుస్తోంది. పంటలు ఫ్రీజ్‌ చేసిన వివరాలతో రైతుబంధు సొమ్మును జమ చేయనుంది. తాజాగా సీసీఎల్‌ఏ మరో డేటాను వ్యవసాయ శాఖకు పంపినట్లు తెలిసింది. దీని ప్రకారం మునుపు ఇచ్చిన దానికంటే ఎక్కువ విస్తీర్ణం, ఎక్కువ పట్టాదారులు ఉన్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టులకు, ఇతర వ్యవసాయేతర వాటికి బదలాయించిన భూములను ఇందులో నుంచి తీసివేసినట్లు తెలిసింది. ఈ వివరాలను వ్యవసాయ శాఖ ఏఈఓలకు అందుబాటులో ఉంచుతుందా లేదా అనేది తెలియాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top