కర్కశంగా కాల్చేశారు..

father murdered his son - Sakshi

ఆస్తిని పంచమన్నందుకు చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకును చంపిన కన్నతండ్రి

తలపై కర్రతో కొట్టి.. ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య

మృతదేహాన్ని కృష్ణానదిలో పడేయాలని ఆటోలో తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడిన వైనం

షాద్‌నగర్‌లో ఘటన.. కందూరులో వెలుగులోకి!

అడ్డాకుల (దేవరకద్ర): సభ్యసమాజం తలదించుకునే విధంగా ఓ తండ్రి తన చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకును దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు రేపిన చిచ్చుతో ఇంత దారుణానికి ఒడిగట్టారు. కన్న కొడుకన్న కనికరం లేకుండా హత్య చేసి శవాన్ని కృష్ణానదిలో పడేయాలని ఆటోలో తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో తండ్రికి సైతం నిప్పంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన అడ్డాకుల మండలం కందూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..

మద్యానికి బానిసై..
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని పరిగి రోడ్‌లో నివాసముండే రంగవల్లి రామస్వామిగౌడ్‌కు భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు యాదగిరిగౌడ్‌(35)కు భార్య జ్యోతి, మూడేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. చిన్న కొడుకు శ్రీనివాస్‌గౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు కొడుకులు ఆటోలను నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు యాదగిరిగౌడ్‌ మద్యానికి బానిపై కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవాడు. రెండేళ్ల క్రితం అతని భార్య కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి యాదగిరి ఇంటి వద్దే ఉంటూ ఆటోను నడుపుకొంటున్నాడు. అయితే కొన్నాళ్ల నుంచి ఆస్థి విషయంలో తండ్రి, తమ్ముడితో గొడవ పడుతున్నాడు. పెళ్లీడుకు వచ్చిన చెల్లెలు మాధవి పెళ్లి చేయాలని తండ్రి చేస్తున్న ప్రయత్నాలను పెద్ద కొడుకు అడ్డుకుంటున్నాడు.

రాత్రి 11 గంటల సమయంలో..
రామస్వామి భార్య, కుమార్తె పడుకున్న గదికి 11 గంటల సమయంలో బయటి నుంచి గడియ పెట్టారు. పక్క గదిలో ఉన్న యాదగిరితో కలహాలకు నీవే కారణమంటూ గొడవ పడ్డారు. ఇతంలోనే తండ్రి రామస్వామి కర్రతో యాదగిరి తలపై బలంగా కొట్టడంతో కిందపడిపోయాడు. వెంటనే చిన్న కొడుకు క్యాన్‌ తెచ్చి పెట్రోల్‌ పోయగా తండ్రి నిప్పటించాడు. మంటలకు తాళలేక యాదగిరి తనువు చాలించాడు. ఈ ఘటనలో తండ్రి రామస్వామి ముఖం, ఛాతి, కాళ్లకు మంటలు అంటుకుని గాయాలయ్యాయి.

తండ్రిని కొట్టడంతో మనస్థాపం..
ఇంటిని తన పేర రాయాలని ఇటీవల యాదగిరి తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. ఇంటి వద్ద నిత్యం గొడవ జరుగుతుండటంతో రెండు నెలల క్రితం చిన్న కొడుకు శ్రీనివాసులు భార్య సైతం తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం ఇంటిని తన పేర రిజిస్ట్రేషన్‌ చేయాలని తండ్రితో గొడవ పడిన యాదగిరి అందుకు నిరాకరించిన తండ్రిని చితకబాదాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన చిన్న కొడుకు తండ్రిని అన్న కొట్టిన విషయం తెలుసుకుని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలకు కారణమవుతున్న పెద్ద కొడుకును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

ట్రాలీ ఆటోలో వేసుకుని..
యాదగిరి మృతిచెందిన తర్వాత శవాన్ని కృష్ణానదిలో పడేయడానికి శ్రీనివాసులు నడిపే ట్రాలీ ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో శాఖాపూర్‌ టోల్‌గేట్‌ మీదుగా వెళ్లకుండా కందూర్‌ వైపు వెళ్లారు. అదే సమయంలో పెట్రోలింగ్‌కు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్‌ అమర్‌నాథ్‌ తెల్లవారుజామున 4 గంటలకు ఆటోను అనుమానంగా ఆపాడు. అందులో ఏముందని చూడగా శవం కనిపించడంతో తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఆర్‌.మధుసూదన్‌ ఘటనా స్థలానికి వెళ్లి తీవ్ర గాయాలపాలైన తండ్రిని అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. చిన్న కొడుకు శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం జడ్చర్ల టౌన్‌ సీఐ బాలరాజు వచ్చి విచారణ చేపట్టారు. అదే ఆటోలో శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి  శ్రీనివాసులును కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top