భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో ముగ్గురు పిల్లలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి, తానూ తాగి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ల గ్రామంలో బుధవారం జరిగింది.
కూతురు మృతి..ఇద్దరు కుమారుల పరిస్థితి విషమం
ఖమ్మం: భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో ముగ్గురు పిల్లలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి, తానూ తాగి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం రూరల్ మండలం గుదిమళ్ల గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి...గ్రామానికి చెందిన చింతల వెంకన్న(35), అలివేలు దంపతులకు కుమారులు ఎల్లయ్య, గోపి, కూతురు నాగేశ్వరి(6) ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో వెంకన్న భార్యపై చేయిచేసుకోగా ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆమె ఇక రాదేమోననే మనస్తాపంతో బుధవారం వెంకన్న పాఠశాలకు వెళ్లిన ముగ్గురు పిల్లలను తీసుకొచ్చి.. అప్పటికే విషం కలిపి ఉంచిన కూల్‌డ్రింక్‌ను తాగించి, తను కూడా తాగాడు. అందరూ అపస్మారక స్థితిలో పడి ఉండడంతో గమనించిన పొరుగువారు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వెంకన్న, నాగేశ్వరి మృతి చెందగా ఎల్లయ్య, గోపి చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.