తవ్వుకో.. దోచుకో..

Farmers Problems With Sand Mafia In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఆకేరువాగు అడ్డాగా రోజువారీగా టన్నుల కొద్దీ ఇసుక నగరానికి చేరుతోంది. ధనార్జనే ధ్యేయంగా దళా రులు రెచ్చిపోతున్నారు. ఇక వాగుల్లో టన్నుల కొద్దీ ఇసుక తోడుకుంటూ పోతుంటే భూగర్భజలాలు అడుగుంటుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కారణమేదైనా ఇలా టన్నుల కొద్దీ ఇసుక తరలించుకుపోతే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్రమ  దందాకు అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్‌ నగరం దగ్గరలో ఉండడంతో ఇసుక దళారుల దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది.

వాల్టాకు తూట్లు..
జిల్లాలో  వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మం డలంలోని ఆకేరు వాగుకు చుట్టు పక్కల ఉన్న పచ్చని చెట్లు, పొలాలను ఇసుకాసురులు నేలమట్టం చేస్తున్నారు. రైతుల కంట్లో ఇసుక కొడుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు కోసం వాల్టా(నీరు, భూమి, చెట్టు) చట్టం పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికారులే అక్రమార్కులకు కొమ్ము కాస్తూ  తూట్లు పొడుస్తున్నారు. అధికారులు మా మూళ్ల మత్తులో జోగుతుండగా అక్రమార్కులు వాల్టా చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఆకేరు వాగు అడ్డాగా..
ఆకేరు వాగు శివారు రైతుల పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. రాత్రికి రాత్రే వారికి తెలియకుండానే పొలాల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. వాగుకు ఆనుకొని మా పొలాలు ఉండడమే శాపంగా మారిందని కర్షకులు కన్నీరు మున్నీరవుతున్నారు. వర్ధన్నపేటలోని కొత్తపల్లి, కూనూరు, ల్యాబర్తి, నందనం, ఇల్లంద, పర్వతగిరి మండలంలోని రోళ్లకల్లు, అన్నారం, నారాయణపురం, కల్లెడ, రాయపర్తి మండలంలోని కొత్తూరు గుండా ఆకేరు వాగు పారుతుంది. ఈ వాగు చుట్టు పక్కల ఉన్న భూముల్లో ఇసుకను తోడేస్తున్నారు. వరంగల్‌ నగరంతో పాటు, సంగెం, నెక్కొండ, ఐనవోలు మండలాలకు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.

ఇక్కడి రైతుల పచ్చని పంటలను ధ్వంసం చేస్తూ ఇసుక తవ్వకాలను ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న ఇసుక అక్రమదందాతో వందల ఎకరాల్లో సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల రణగొణ ధ్వనితో దద్దరిల్లుతున్న ఆకేరువాగు తెల్లవారుకాగానే అంతా నిర్మానుష్యంగా మారుతుంది. ఇసుక తవ్వకాలతో చుట్టు పక్క రైతులు విలువైన పంట భూములను కోల్పోవాల్సిన దుస్థితి ఎదురవుతుందని తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల పంచాయితీ రోడ్డెకుతున్నా అధికార ముసుగులో ఉన్న పెద్దలు సామరస్యంగా చక్కబెడుతూ అక్రమ తవ్వకాలకు పచ్చజెండా ఊపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కనిపించని దాడులు
ఇసుక రవాణాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరికలు రెవెన్యూ, పోలీస్‌ అధికారులు చేయడమే తప్పా దాడులు చేసిన సంఘటన లేవు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో నేరుగా విజిలెన్స్‌ అధికారులు రంగంలో దిగారు. స్థానిక పోలీసులకు సమాచారం తెలియకుండానే ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ప్రతీ రోజు వరంగల్, హన్మకొండ, కాజీపేటలకు దాదాపు 300లకు పైగా ట్రాక్టర్లు వస్తున్నాయి. ఆగస్టు 28న విజిలెన్స్‌ అధికారులు 26 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 13, సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 13 ట్రాక్టర్లను విజిలెన్స్‌ అధికారులు అప్పగించారు.

రాత్రి సమయంలో తవ్వుతున్నట్లు తెలుస్తోంది
పగలు సమయంలో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించకుండా రాత్రి సమయంలో తవ్వుతున్నారని సమాచారం అందింది. ఇటీవల రైడ్‌ చేసి పలు మోటార్లు, ట్రాక్టర్లు సీజ్‌ చేశాం. త్వరలో దాడులు చేస్తాం. ప్రభుత్వ అనుమతి లేనిది ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
–కనకయ్య, తహసీల్దార్, వర్ధన్నపేట

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top