అక్రమ సంబంధాలు అంటగట్టి.. బయటకు గెంటాడు.. | fake jouranaoist in warangal | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధాలు అంటగట్టి.. బయటకు గెంటాడు..

Jul 26 2015 10:11 PM | Updated on Sep 3 2017 6:13 AM

జర్నలిస్టు పేరుతో చెలామణి అవుతున్న ఓ వ్యక్తి తన భార్యకు అక్రమ సంబంధాలు అంటగట్టడమేగాక, పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కూడా తన సంతానం కాదంటూ వేధించడంతో భార్య అతడి ఇంటి ఎదుటే బైఠాయించింది.

వరంగల్: జర్నలిస్టు పేరుతో చెలామణి అవుతున్న ఓ వ్యక్తి తన భార్యకు అక్రమ సంబంధాలు అంటగట్టడమేగాక, పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కూడా తన సంతానం కాదంటూ వేధించడంతో భార్య అతడి ఇంటి ఎదుటే బైఠాయించింది. వివరాలు.. వరంగల్ రామన్నపేటలో నివాసముంటున్న రాసాల వెంకట్ ఓ మాస పత్రిక ఎడిటర్‌గా చెప్పుకొంటూ జర్నలిస్టుగా కొనసాగుతున్నాడు. అతడికి పావనితో 2000 ఏప్రిల్ 23న వివాహమైంది. పెళ్లి సమయంలో అతడికి రూ. 3 లక్షల కట్నం, 3 తులాల బంగారం, మోటార్‌సైకిల్ కోసం రూ. 50 వేలు ఇచ్చారు. కొంతకాలానికి పావని-వెంకట్ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. అంతే.. వెంకట్ అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. దీంతో పెద్దమనుషులు పంచాయితీ చేసి న్యూశాయంపేటలోని ఇంట్లో రెండు పోర్షన్లను రాసిచ్చారు. వాటి అద్దె కూడా వెంకట్ తీసుకుంటున్నాడు.

ఆ తర్వాత మరోసారి వేధించి రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు. కొంతకాలంగా భార్య పావనికి అక్రమ సంబంధాలు అంటగట్టడమేగాక, ఇద్దరు ఆడపిల్లలు తనకు పుట్టలేదని వెంకట్ వేధించేవాడు. డీఎన్‌ఏ పరీక్షల కోసం ఈ ఏడాది జూలై 7న నోటరీ స్టాంపు కాగితాలపై పావనితో బలవంతంగా సంతకాలు కూడా చేయించుకొని, భార్యా పిల్లల్ని బయటకు గెంటాడు. భర్త వేధింపులు భరించలేని పావని తల్లి గారింట్లో ఉంటూ.. 15 రోజుల క్రితం పోలీస్ కమిషనర్‌ను కలిసి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని మహిళా పోలీస్ స్టేషన్‌కు పంపారు. స్పందన లేకపోవడంతో ఐద్వా మహిళా సంఘం అండతో భర్త నివాసం ఎదుటే ఆదివారం ఆందోళనకు దిగింది. మట్టెవాడ సీఐ శివరామయ్య వచ్చి వెంకట్‌పై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉంచేలా న్యాయం చేస్తానని పావనికి హామీ ఇచ్చారు. కాగా, ఇలాంటి వ్యక్తులను సాంఘిక బహిష్కరణ చేయాలని మాజీ కార్పొరేటర్ మెడికట్ల సారంగపాణి, వెంకట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా కార్యదర్శి రజిత డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement