హామీల అమలులో విఫలం

Failure to enforce guarantees - Sakshi

కేసీఆర్‌పై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ధ్వజం

దళిత, గిరిజన, బీసీలను అణగదొక్కుతున్నారు 

ఖమ్మంలో గిరిజన రైతులకు సంకెళ్లు వేయడమే నిదర్శనం 

కాంగ్రెస్‌కు అధికారం ఖాయం

  ఇల్లెందులో కాంగ్రెస్‌ ప్రజాచైతన్య బస్సుయాత్ర సభ

సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం నడుస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌కు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాచైతన్య బస్సుయాత్ర సోమవారం భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చేరుకుంది. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉత్తమ్‌ మాట్లా డుతూ కేసీఆర్‌ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్రజాకంటక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో పాటు, కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు భూ పంపిణీ, ఏకకాలంలో రుణమాఫీ తదితర సంక్షేమ పథకాల అమ లులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉద్యమం లో పోరాడిన నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగా లు ఖాళీగా ఉండగా, 20 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. గిరిజనుల ఆత్మగౌరవం నిలిపేం దుకు కాంగ్రెస్‌ హయాంలో పోడు భూములకు అటవీహక్కుల చట్టం కింద పట్టాలివ్వగా, నేటి ప్రభుత్వం హరితహారం పేరుతో లాక్కుంటోందని మండిపడ్డారు. రైతులకు మద్దతు ధర విషయంలో ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సింగరేణి డిపెండెంట్‌ ఉద్యోగాలకు సంబంధించి జీవో ఇచ్చి.. మరోవైపు ఎంపీ కవిత ఆధ్వర్యంలోని జాగృతి వ్యక్తి ద్వారా కోర్టులో కేసు వేయించారని విమర్శించారు. గిరిజన, మైనార్టీ, బీసీల రిజర్వేషన్ల విషయంలోనూ మోసం చేశారన్నారు. సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి కేవలం మిషన్‌ భగీరథ, కాకతీయ, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పేరు తో వేల కోట్లు ఇచ్చి కాంట్రాక్టర్లకు మేలు చేయడంతో పాటు కేసీఆర్‌ కుటుంబం కమీషన్లు దండుకుంటోం దని ఆరోపించారు. ఈ డబ్బుతోనే ఇతర పార్టీల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులను కొంటున్నారన్నా రు. కాంగ్రెస్‌ పార్టీ వస్తేనే అన్నివర్గాల ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సభలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, వీహెచ్, షబ్బీర్‌అలీ, రేవంత్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బలరాంనాయక్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రేణుకాచౌదరి, సంభాని చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top