చిరిగిన విస్తరి..

Extensive Leaves Are Faded In Villages And Towns - Sakshi

ప్లాస్టిక్‌ రాకతో తగ్గిన గిరాకీ 

తయారీదారులకు ఉపాధి కరువు 

రుణాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ 

పట్టించుకోని ప్రభుత్వం  

ఆదిలాబాద్‌రూరల్‌: ఒకప్పుడు పెళ్లిళ్లు, పేరంటాల్లో, పండుగల్లో విస్తరాకుల్లో భోజనం వడ్డిస్తే ఓ గొప్ప మర్యాద. నాలుగు ఆకులు బయటపడితే శుభకార్యం జరిగినట్లు.  విస్తరాకుల్లో నైవేద్యాలు పెట్టి పూజలు చేస్తే గొప్ప శుభకార్యం జరిగినట్లు భావించేవారు. కాని మారిన పరిస్థితులతో విస్తర్ల మనుగడ కష్టమవుతుంది. ప్లాస్టిక్‌ పేపర్‌ ప్లేట్లు రావడంతో విస్తరి ఆకులు కనిపించకుండా పోయాయి. దీంతో అనివార్యంగా తయారీదారులు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఆకుల తయారీపైనే ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి.  విస్తర్ల తయారీదారులు గిరాకీ లేక, కుటుంబ పోషణ భారమై దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని వివిధ పట్టణాలతో పాటు మండలాల్లో ఈ వృత్తిపై ఆధారపడి సుమారు 200 నుంచి 300 కుటుంబాలకు పైగా జీవనోపాధి పొందుతున్నారు.
గ్రామాల్లో కుట్టిన విస్తరాకులను రకరకాల నమునాల్లో కత్తిరించి నగరా ప్రాంతాలకు సరఫరా చేసి జీవనోపాధి పొందేవారు. ప్రస్తుతం రోజంతా కష్టపడుతున్నా  కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని తయారీదారులు వాపోతున్నారు. మోదుకు ఆకుల కోసం అటవీ ప్రాంతాలకు వెళ్లినపుడు కొంత మంది మృత్యువాత పడిన సంఘటనలు సైతం అనేకంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
 
కబళించిన రియల్‌ ఎస్టేట్‌.. 
విస్తరాకుల తయారీ వృత్తిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కబళిస్తోంది. కొన్ని చోట్ల వ్యవసాయ పొలాలు ఇళ్ల స్థలాలుగా, ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములను చదును చేసి వ్యవసాయం సాగు చేస్తున్నారు. అటవీ భూములను చదును చేయడంతో మోదుగ చెట్లు మాయమయ్యాయి. మరికొన్ని చోట్లా బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భూములను కొని చుట్టూ ఫెన్సింగ్‌ చేయడంతో అందులోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో తయారీదారులు రోజుల కొద్దీ ఆకుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో వారికి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. కనీసం కూలీ డబ్బులు కూడా రాలేని దుస్థితి నెలకొందని తయారీదారులు పేర్కొంటున్నారు.
ఇలాగైతే వృత్తి కనుమరుగు అయ్యే ప్రమాదం నెలకొంటుందని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారి పరిస్థితి ఏంటన్నది అగమ్యగోచరంగా మారింది. కనీసం తమ కుటుంబాల్లో ఉన్నత చదువులు చదువుకున్న వారికి ఉద్యోగావకాశాలను కల్పించాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వాలు రుణాలను అందజేసి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top