హస్తం గూటికి నాగం

Ex Ministar Nagam Janardhan Reddy Join In Congress party - Sakshi

పెద్దల సమక్షంలో త్వరలో కాంగ్రెస్‌లోకి.. 

స్వయంగా ప్రకటించిన మాజీ మంత్రి జనార్దన్‌రెడ్డి 

అయోమయంలో పార్టీ శ్రేణులు 

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : మాజీమంత్రి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించా రు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ నాగం కొంతకాలంగా చెబుతున్నప్పటికీ ఇన్నాళ్లూ అందుకు అనువైన పరిస్థితులు రాలేదు. బీజేపీకి రాజీనామా చేసిన నాగం ఆ వెంటనే కాంగ్రెస్‌లో చేరాలని భావించారు. అనుకోని అవాంతరాలు ఎదురవడంతో ఆయన రాక కాస్త ఆలస్యమైంది.  
ఇన్నాళ్లూ టికెట్టు కోసం తర్జనభర్జన 
కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి నాగంకు పార్టీలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించినప్పటికీ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఇస్తామన్న స్పష్టత లభించలేదు. దీంతో ఆయన ఇన్నాళ్లూ పార్టీలో చేరే విషయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవలే పార్టీలో యువతకు ప్రాతినిథ్యం కల్పిస్తామని ప్రకటించారు. అప్పటినుంచి నాగం టికెట్టుకోసం తర్జన భర్జన పడినట్లు తెలిసింది. నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీలో పోటీ చేసేందుకే ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇవి తనకు చివరి ఎన్నికలని ఆయనే స్వయంగా చెప్పుకుంటూ ప్రజల సానుభూతి కోసం ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలాఉండగా దానిపై ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి వర్గం మరోలా ప్రచారం చేస్తోంది. నాగంకు అవకాశం కల్పిస్తే పార్టీకి చాలా మంది దూరమవుతారని పరోక్షంగా హెచ్చరించారు.  
అయోమయంలో కాంగ్రెస్‌ నాయకులు 
కాంగ్రెస్‌ పార్టీ నాయకుల పరిస్థితి అయోమయంగా మారింది. నాగం కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తున్నానని ప్రకటించారు. గతంలో ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఆయనను బహిరంగంగానే అడ్డుకుంటామని వారు కూడా ప్రకటించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురవుతున్నారు. కొన్నిరోజులుగా ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ తన కుమారుడే కాబోయే కాంగ్రెస్‌ అభ్యర్థి అంటూ సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులను పరిచయం చేశారు. నాగం పార్టీలోకి వస్తున్నారన్న ప్రకటన అనంతరం దామోదర్‌రెడ్డి సైతం పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో మరింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  
కార్యకర్తల అండదండలతో వస్తా.. 
కందనూలు : ‘కార్యకర్తలే నా బలం.. వారి అభీష్టం మేరకు త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నా.. కాంగ్రెస్‌ పెద్దల సమక్షంలో త్వరలోనే చేరిక ఉంటుంది.. అని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల మనోభావాలను దృష్టిలో  ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, రానున్న రోజుల్లో ఆ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చేస్తున్నవి కేవలం ప్రగల్బాలేనని, ప్రాజెక్టులను ఉద్దరించడానికి కాదన్నారు. ఉమ్మడి జిల్లాకు 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని, ఉమ్మడి జిల్లాలో ఉన్న నెట్టెంపాడు, భీమ, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద కేవలం లక్షా 50 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోందని తెలిపారు. కాల్వలు, టెన్నల్‌ సామర్థ్యం పెంచంకుండా, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్స్‌ లేకుండా 6.50 లక్షల  ఎకరాలకు సాగునీరు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడుతోందని, దోచుకోవడమే పనిగా నాయకులు బేరాలు ఆడుతున్నారని ఆరోపిం చారు. సమావేశంలో సింగి ల్‌ విండో చైర్మెన్‌ వెంకట్రా ములు, నాయకులు అర్థం రవి, కాశన్న, నసీర్, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top