ఫొటో చూసి ఓటేయవచ్చు

EVMs Will Have Photograph Of Candidates - Sakshi

బ్యాలెట్‌లో అభ్యర్థి ఫొటో 

అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా 

నోటా వద్ద మాత్రం ఖాళీగా

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వివిధ ప్రత్యేకతలను సంతరించుకోనున్నాయి. ప్రజలు ఎవరికి ఓటు వేసిందీ తెలుసుకునేందుకు వీవీప్యాట్‌లు వినియోగించనుండటం, నగరంలో దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేందుకు ‘వాదా’యాప్‌ ఉపయోగపడనుండటం, అంధులకు బ్రెయిలీ లిపిలో ఎపిక్‌ కార్డులు జారీ చేస్తుండటం గురించి తెలిసిందే. ఈసారి అభ్యర్థి ఫొటో చూసి కూడా ఓటేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పిస్తోంది. ఈవీఎంలలో అభ్యర్థి పేరు, గుర్తుతోపాటు  2్ఠ2.5 సెం.మీల ఫొటో కూడా ఉంటుంది. నోటా వద్ద మాత్రం ఫొటో స్థానంలో ఖాళీగా ఉంటుంది. అభ్యర్థుల పేర్లు అక్షరక్రమంలో తొలుత జాతీయపార్టీల అభ్యర్థులవి, తర్వాత ప్రాంతీయ పార్టీలవి, ఆ తర్వాత ఇండిపెండెంట్లు లేదా ఇతర పార్టీలవి ఉండనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.  

ఓటరు గందరగోళానికి గురికాకుండా 
ఒక నియోజకవర్గంలో పోటీచేసే అభ్యర్థుల్లో ఒకరి కంటే ఎక్కువమందికి ఒకే పేరు, లేదా దగ్గరి పోలికలతో ఉన్న పేరు ఉంటే ప్రజలు ఓటు వేసేటప్పుడు గందరగోళానికి గురి కాకుండా ఉండేందుకే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను పోటీ చేసే అభ్యర్థులు తాజాగా తీయించుకున్న తమ స్టాంప్‌ సైజ్‌ కలర్‌ఫొటోను సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మరో నాలుగు రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.  

ఫొటోలు పెట్టినా రీ పోలింగ్‌ 
గతేడాది మార్చిలో జరిగిన మహబూబ్‌నగర్, రంగారెడ్డి,హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సాధారణ బ్యాలెట్‌ పత్రాల్లో అభ్యర్థుల ఫొటోలుంచారు. ఎన్నికల విధుల్లోని అధికారుల అశ్రద్ధ కారణంగా బ్యాలెట్‌ పత్రాల్లో ఒక అభ్యర్థి పేరున్న చోట మరో అభ్యర్థి ఫొటో ముద్రించారు. ఎన్నికల బరిలో ఉన్న ఆదిలక్ష్మయ్య, పాపన్నగారి మాణిక్‌రెడ్డిల ఫొటోలు తారుమారయ్యాయి. దీంతో రీపోలింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఓటర్లు రెండుసార్లు ఓట్లు వేయాల్సి రావడంతోపాటు ప్రభుత్వానికి బోలెడు వ్యయప్రయాసల్ని ఈ ఎలక్షన్‌ మిగిల్చింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top