80శాతం ఓట్లేస్తే దత్తత తీసుకుంటా 

Errabelli Dayakar Rao Election Campaign In Mahabubabad Constituency - Sakshi

కవితను గెలిపించి మానుకోటను కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇద్దాం 

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

అశ్వాపురం, గార్ల, బయ్యారం: సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 80శాతం ఓట్లు వేసిన గ్రామాలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి కృషి చేస్తానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. మహబూబాబాద్‌ ఎంపీగా మాళోతు కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించి మానుకోటను సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామన్నారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ అసత్య ఆరోపణలు చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. శుక్రవారం అశ్వాపురం, గార్ల, బయ్యారంలో జరిగిన ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం తానే స్వయంగా వచ్చి పట్టాలు ఇప్పిస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో కేసీఆర్‌ సారధ్యంలో తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం హర్షించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావన్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు.

బయ్యారం, గార్ల మండలాల రైతులకు కల్పతరువుగా ఉన్న బయ్యారం పెద్దచెరువును రెండు అడుగులమేర ఎత్తు పెంచేలా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న బయ్యారం పెద్దచెరువును గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలోనే అభివృద్ధి చేశానన్నారు. ఆ తరు వాత 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ బయ్యారం పెద్దచెరువు గురించి పట్టించుకోలేదన్నారు. ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయాలనుకున్నట్లు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ అన్నారు.

బయ్యారం ఉక్కుపరిశ్రమను సాధించాలంటే కవితను ఎంపీగా గెలిపించాలన్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఇల్లెందు కోడలినైన తనను ఓటర్లు ఆశీర్వదించి గెలిపించాలని ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు కేంద్రంతో పోరాడేందుకు తనకు అవకాశమివ్వాలన్నారు. గడప గడపకూ టీఆర్‌ఎస్‌ జెండాను, గుర్తును తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ అన్నారు.

కార్యక్రమంలో ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దిండిగల రాజేందర్, జెడ్పీటీసీ తోకల లత, ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ గజ్జల లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ అశ్వాపురం మండల అధ్యక్షుడు కందు ల కృష్ణార్జున్‌రావు, గార్ల మండల అధ్యక్షుడు వడ్లమూడి దుర్గాప్రసాద్, బయ్యారం మండల అధ్యక్షుడు మూల మధుకర్‌రెడ్డి, డీసీసీ చైర్మన్‌ మోహన్‌గాంధీనాయక్, బానోత్‌ హరిసింగ్, ఎంపీపీ మాళో త్‌ వెంకట్‌లాల్, జెడ్పీటీసీ సభ్యురాలు ఎద్దు మాధవి, ఎంపీపీ జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top