బాల్యం బుగ్గిపాలు!

Education Department Survey on Child Labour in mahabubnagar - Sakshi

బడి బయటి పిల్లలపై విద్యాశాఖ సర్వే

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2,152 మంది గుర్తింపు

ప్రభావం చూపని ప్రభుత్వ కార్యక్రమాలు

జాడేలేని వర్క్‌సైడ్, సీజనల్‌ హాస్టల్స్‌ ఏర్పాటు

అత్యధికంగా గద్వాల జిల్లాలో 622, నారాయణపేటలో 528 మంది చిన్నారులు

జిల్లా నుంచి వలస వెళ్లేవారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారే బాధితులు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పలకా బలపం పట్టి.. అక్షరాలు దిద్దాల్సిన ఆ చిట్టిచేతులు పంట పొలాల్లో తట్టా బుట్టా పట్టుకొని వ్యవసాయ పనులు చేస్తున్నాయి. తోటి పిల్లలతో ఆడి, పాడాల్సిన ఆ చిన్నారులు.. ఇటుక బట్టీల్లో మట్టి కొట్టుకుపోతున్నారు. విద్యాహక్కు చట్టం బడిఈడు గల 5 నుంచి 14 ఏళ్లలోపు ప్రతి చిన్నారి కచ్చితంగా పాఠశాల విద్యను అభ్యసించాలని చెబుతోంది.. ఈ క్రమంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులను బడిబాట పట్టించేందుకు ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా.. వారి బతుకులకు మాత్రం భరోసా కల్పించలేకపోతున్నాయి.. ఇందులో భాగంగా ఆయా జిల్లాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో బడికి వెళ్లకుండా,  వివిధ ప్రాంతాల్లో ఉంటున్న చిన్నారులకు గుర్తించేందుకు రెండు నెలల పాటు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎక్కువగా నారాయ ణపేట జిల్లాలోని మద్దూరు, మాగనూరు మండలాలు, జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు, మల్దకల్, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్‌ మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో బడిబయటి పిల్లలు ఎక్కువగా ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

30 మంది చిన్నారులకు..
ఉపాధి కోసం చాలామంది ఒక  ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జీవనోపాధి కోసం వలస వెళ్తుంటారు. భవన నిర్మాణం, ఇటుక బట్టీలు వంటి స్థిరంగా ఉపాధి పొందే ప్రాంతాల్లో చిన్నారులను గుర్తించి వారికి అందుబాటులో పనిచేస్తున్న ప్రాంతంలో పాఠశాలలు అందుబాటులో లేని క్రమంలో కనీసం 30 మంది చిన్నారులు ఉంటే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ వర్క్‌సైడ్‌ హాస్టల్‌ నిర్వహించాల్సి ఉంది. వీరితోపాటు వివిధ తండాలు, గ్రామాల్లో తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సహకారంతో వారి పిల్లలకు స్థానికంగా సీజనల్‌ హాస్టల్‌ ఏర్పాటు చేయాలి. చిన్నారులు ఇంత ఎక్కువ సంఖ్యలో బడికి పోకుండా ఉంటున్నప్పటికీ ప్రభుత్వం హాస్టళ్ల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వీటి నిర్వహణపై జిల్లా విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో వీటి ఏర్పాటు జరగలేదు. ఇంతేకాకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించి తర్వాత పాఠశాలలకు పంపించకుండా వివిధ పనులకు పంపిస్తున్నారు.

మండల స్థాయిలో సర్వే
విద్యాశాఖ అధికారులు రెండు నెలల పాటు నిర్వహించిన మండల స్థాయి సర్వేలో మొత్తం 2,152 మంది 5– 14 ఏళ్లలోపు చిన్నారులు బడిబయట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వర్షాకాలం ముగిసిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు తండాలు, వివిధ గ్రామాల నుంచి ఉపాధి, కూలీ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారున్నారు. వీరు చిన్నారులను ఇంటి వద్ద వృద్ధులతో వదిలేసిపోవడంతో చిన్నారుల ఆలనాపాలన, చదువుల గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వారు పాఠశాల ముఖం చూసే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా ఇరత ప్రాంతాల నుంచి పాలమూరు జిల్లాకు వలస వచ్చే వారు ఎక్కువగా ఇటుక బట్టీలు, బొగ్గు బట్టీలు, బొంతలు కుట్టేవారు, ఇతర జీవనోపాధి కోసం వచ్చే పిల్లలు ఎక్కువగా పాఠశాలలకు వెళ్లకుండా ఉంటున్నారు. వీటితోపాటు మరెంతో మంది చిన్నారులు వివిధ కారణాలతో చదువులకు దూరమవుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top