డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్ల ఓ సిమెంట్‌లారీ చెట్టును ఢీకొని బోల్తాపడింది.
రంగారెడ్డి (చేవెళ్ల): డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్ల ఓ సిమెంట్‌లారీ చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో లారీడ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాదం చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ బస్టాప్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన బోయపల్లి పరమేశ్(25) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటీలాగే శనివారం తాండూరులోని సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ లోడ్‌తో ఆదివారం తెల్ల వారు జామున మూడు గంటలకు అక్కడి నుంచి నగరానికి బయలు దేరాడు. మల్కాపూర్ బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే అతివేగంగా ఉన్న లారీ అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టింది.
చెట్టును బలంగా ఢీకొనటంతో లారీ పూర్తిగా ధ్వంసమైంది. లారీలో డ్రైవర్ పరమేశ్ ఒక్కడే ఉండటంతో అతడు లారీలో ఇరుకుపోయాడు. స్థానికులు, వాహనదారులు గమనించి డ్రైవర్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. అప్పటికే అతడు రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలోలో చేవెళ్లకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతడు మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతేదేహాన్ని చేవెళ్ల ఆసుపత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.