దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు

Do not keep pending applications :  Jyothi Buddha Prakash - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: అధికారులు, కలెక్టర్‌ దృష్టికి వచ్చిన సమస్యలే మళ్లీ మళ్లీ గ్రీవెన్స్‌లో వస్తున్నాయని కలెక్టర్‌ ఎం.జ్యోతిబుద్ధప్రకాశ్‌ అన్నారు. ఒకసారి వచ్చిన సమస్యను పరిష్కరిస్తే వారు రాకుండా ఉంటారని, ఆ సమస్య మళ్లీ వచ్చే ఆస్కారం ఉండదని, మళ్లీ మళ్లీ అవే సమస్యలు రాకుండా.. పెండింగ్‌లో ఉంచకుండా వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి అరగంటపాటు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆరుగురు ఫోన్‌ చేసి తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

అనంతరం ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణారెడ్డి అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన దరఖాస్తులు ఎన్ని.. ఇంత వరకు పరిష్కరించినవి ఎన్ని.. ఇంకెన్ని పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కువగా వచ్చే దరఖాస్తుల్లో మండల స్థాయిలో పరిష్కారమయ్యేవిగా ఉన్నాయని, అక్కడి అధికారులు పరిష్కరించి ప్రజలకు సహకరించాలని సూచించారు. డీఆర్వో బానోత్‌శంకర్, ఆర్డీవో సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యశ్రీ వర్తించదటా..!
మా పాప హిందూ(9) తలలోని బ్రెయిన్‌ పక్కన ఎముక పెరుగుతోందని హైదరాబాద్‌ యశోద ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. ఆపరేషన్‌ చేసి తొలగించాలని, రూ.70 వేలు ఖర్చవుతుందని అన్నారు. చికిత్స కోసం ఐదు నెలలుగా ప్రభుత్వం, అధికారులను ఆర్థిక సాయం కోరుతున్నా. ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. నేను ఎలక్ట్రీషియన్, నా భార్య విజయ బీడీ వర్కర్‌. ఇప్పటివరకు మా దగ్గర ఉన్న రూ.లక్షా నలభై వేలు ఆసుపత్రికి ఖర్చు చేశాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం వెళ్తే వర్తించదని అంటున్నారు. ఆపరేషన్‌ కోసం రూ.70 వేలు ప్రభుత్వం నుంచి అందించాలని కలెక్టర్‌ను కోరాం. అధికారులు స్పందించి మా కూతురు హిందూను ఆదుకోవాలని కోరుతున్నాం.  
– విజయ పోశేట్టి, టీచర్స్‌కాలనీ, ఆదిలాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top