నాణ్యతకు పట్టాభిషేకం ! 

District Prison Department Opening Petrol Bunks For Quality Goods - Sakshi

పాలమూరు : ద్విచక్ర వాహనం లేదా కారు.. లేదంటే మరొకటి.. మనకు దగ్గర్లోని బంకుకు వెళ్లి పెట్రోల్‌ కాదంటే డీజిల్‌ పోయించుకుంటాం.. మధ్యలో వాహనం ఎక్కడ మొరాయించినా మొదట బంక్‌లో ఇంధనం నాణ్యతపై అనుమానమొస్తుంది.. ఎందుకంటే పరిస్థితులు అలా తయారయ్యాయి.. ప్రతీ వస్తువులో జరుగుతున్నట్లుగానే పెట్రోల్, డీజిల్‌ కల్తీకి అనర్హం కాదన్నట్లుగా మారిపోయింది. నాణ్యత విషయం పక్కన పెడితే మనం చెల్లించిన డబ్బుకు సరిపడా ఇంధనం పోశారా, లేదా అన్నది కూడా అనుమానమే! అందుకే బాగా తెలిసిన, పేరున్న బంక్‌లకు వెళ్లడాన్ని వాహనదారులు అలవాటు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న బంక్‌లకు ఆధరణ లభిస్తోంది. ఈ బంక్‌ల ఏర్పాటుద్వారా వినియోగదారులకు నాణ్యమైన ఇంధనం లభించడమే కాకుండా అటు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధి లభిస్తోంది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లా జైలును ఆనుకుని ఏర్పాటుచేసిన బంక్‌ లాభాల బాటలో నడుస్తోంది. ఇదే మాదిరిగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరికొన్ని బంక్‌ల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నాగర్‌కర్నూల్‌లో నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా.. కల్వకుర్తిలో ఒప్పందం జరిగింది. ఇంకా మరో పది చోట్ల కూడా బంక్‌ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

2016లో ప్రారంభం 
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలును ఆనుకుని 2016లో ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకు ఏర్పాటుచేశారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి బంక్‌ ఇదే. ఈ బంక్‌లో పనిచేసే వారందరూ ఖైదీలే కాగా.. నిత్యం పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. తద్వారా నాణ్యత, పరిమాణంలో తేడా రావడం లేదు. ఫలితంగా రోజురోజుకు వినియోగదారుల ఆదరణ పెరుగుతుండగా.. కాసుల వర్షం కురుస్తోంది. శిక్షను అనుభవిస్తున్న, విడుదలైన ఖైదీలు 20మంది మూడు షిప్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ బంకు ఏర్పాటుతో కారాగారం ఆదాయం కూడా పెరగగా... ఉమ్మడి జిల్లాలో మరిన్ని పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర జైళ్ల శాఖ నిర్ణయించింది.  

నాగర్‌కర్నూల్‌లో పనులు పూర్తి 
మహబూబ్‌నగర్‌ జిల్లా జైళ్ల శాఖ ఆద్వర్యంలో నాగర్‌కర్నూల్‌ సబ్‌ జైల్‌ దగ్గర పెట్రోల్‌ ఏర్పాటు పనులు పూర్తికావొచ్చాయి. మరో రెండు నెలల్లో ఈ బంకును ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు కల్వకుర్తి సబ్‌ జైలు దగ్గర కూడా నూతనంగా ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తికాగా.. సంబంధిత కంపెనీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇక నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. 2019 చివరి నాటికి ఇక్కడ కూడా పెట్రోల్‌ బంకును ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

26దరఖాస్తులు 
ఉమ్మడి జిల్లాలో జైళ్ల శాఖతో కలిసి పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే 26మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌ అందించేలా బంకుల ఏర్పాటుకు జిల్లా జైళ్ల శాఖ నవంబర్‌ 6 నుంచి 10వరకు దరఖాస్తులు స్వీకరించింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రధాన రహదారికి 5 కిలోమీటర్ల పరిధిలో పెట్రోల్‌ బంకులు ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. ప్రధాన రోడ్డుకిరు వైపులా 1000 నుంచి 1500 గజాల భూమి ఇవ్వడానికి ఆసక్తి ఉన్న 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను ఉన్నతాధికారులకు పంపగా.. అక్కడి నుంచి నిర్ణయం వెలువడితే ఆయా ప్రాంతాల్లో బంకుల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. కాగా, అధికారుల కు అందిన 26 దరఖాస్తుల్లో నాగర్‌కర్నూల్, కొత్తకోట, తాండూర్‌ రోడ్డువైపు, అచ్చంపేట, భూత్పూర్‌ ప్రాంతాల నుంచే ఎక్కువ ఉన్నాయి. 

ఒప్పందం ఇలా... 
జైళ్ల శాఖతో కలిపి పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. సొంత స్థలం కలిగి ఉండి జైళ్ల శాఖకు లీజ్‌కు ఇస్తే వారే బంక్‌ ఏర్పాటుచేసి నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారు. ఇలా స్థలం ఇచ్చిన వారికి నెలకు కొంత అద్దె చెల్లిస్తారు. లేదంటే భాగస్వామ్యం ఉండడానికి కూడా అనుమతిస్తున్నారు. అయితే, ఏ విధానంలో బంక్‌ ఏర్పాటుచేసినా నిర్వహణ బాధ్యతలు జైళ్ల శాఖే చూసుకోనుండగా.. శిక్ష అనుభవిస్తున్న, శిక్ష పూర్తి చేసుకున్న వారికే ఉపాధి కల్పిస్తారు. తద్వారా వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌ అందడంతో పాటు ఖైదీలకు ఉపాధి లభించినట్లవుతుంది. 

12 బంకుల ఏర్పాటుకు నిర్ణయం 
ఉమ్మడి జిల్లాలో జైళ్ల శాఖ ఆధ్వర్యాన 12 పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం 26మంది దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. థర్డ్‌ పార్టీతో సర్వే చేసిన తర్వాత బంక్‌లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లోని బంక్‌ విజయవంతంగా నడుస్తోంది. అదేవిధంగా రెండు నెలల్లో నాగర్‌కర్నూల్‌లో బంక్‌ ప్రారంభం కానుంది. పెట్రోల్‌ బంకు ఏర్పాటు తర్వాత జైలు ఆదాయం ఆదాయం బాగా పెరగడమే కాకుండా ఖైదీలకు ఉపాధి లభిస్తోంది. 
– సంతోష్‌రాయ్, సూపరింటెండెంట్, జిల్లా జైళ్ల శాఖ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top