సమగ్రాభివృద్ధే లక్ష్యం

district inaguration day celebrations

పరిపాలన సౌలభ్యం కోసమే చిన్న జిల్లాల ఏర్పాటు

అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి

నగరంపై కేసీఆర్‌ ప్రత్యేక నజర్‌

‘గ్రేటర్‌’ మేయర్‌ నరేందర్‌

ఘనంగా జిల్లా ఆవిర్భావ దినోత్సవం

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఆవిర్భవించిన ఏడాదిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం ముందంజలో ఉంది. రానున్న మూడు నుంచి ఐదేళ్లలో నగరం రూపురేఖలు మారనున్నాయి. సుందర, పరిశుభ్రత, హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టే పథకాలపై పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేశాం. ఇప్పటికే అమలు చేస్తున్నాం.  – అమ్రపాలికాట, కలెక్టర్‌

వరంగల్‌, హన్మకొండ: ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి జిల్లాను సమగ్రాభివృద్ధి చేయడమే లక్ష్యమని వరంగల్‌ మహానగర పాలక సంస్థ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్‌ భవన్‌లో బుధవారం నిర్వహించిన వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆవిర్భావ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకుందామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కంకణబద్ధుడై కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వంతో అన్ని వర్గాలకు మేలు చేకూరే పథకాలు అమలు చేస్తూ అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. ప్రజలకు పరిపాలన పారదర్శకంగా ఉండేందుకు.. పరిపాలన సౌలభ్యానికే  చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో సామాన్య ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి తమ పనులు తాము చేసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. అధికారులకు సైతం పర్యవేక్షణ సులువుగా ఉందన్నారు. తద్వారా ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారానికి నోచుకుంటున్నాయని వివరించారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతోపాటు వరంగల్‌ నగరంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు.

ఈ క్రమంలో వరంగల్‌ నగరానికి రాష్ట్ర బడ్జెట్‌లో ఏడాదికి రూ.300 కోట్లు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. అభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి పటిష్టమైన ప్రణాళిక రూపొందించారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వరంగల్‌ నగరం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రూ.542 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు నగరంలో ప్రారంభమయ్యాయన్నారు. వచ్చే ఏడాది నాటికి ఇంటింటికీ శుద్ధి చేసిన తాగు నీటిని అందించనున్నట్లు చెప్పారు. 58 వేల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ ఆదా చేస్తున్నామన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన లేని నగరంగా చేశామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 38 నుంచి 28వ ర్యాంక్‌కు చేరుకున్నామన్నారు. టూరిజంలో స్వచ్ఛత అవార్డు, స్కోచ్‌ అవార్డులు అందుకున్నామన్నారు. నగరంలో పరిశుభ్రత, తాగునీరు అందించడంలో ఏడాది కాలంలో సఫలమయ్యాన్నారు.

దీనికి సహకరించిన కలెక్టర్, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పర్యాటకులను విశేషంగా అకట్టుకుంటామన్నారు. కాగా,  స్త్రీనిధి కార్యక్రమం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.7.60 కోట్ల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్, జాయింట్‌ కలెక్టర్లు హరిత, దయానంద్‌. ఐసీడీఎస్‌ మహిళ ఆర్గనైజర్‌ కమరున్నీసా బేగం, ట్రైనీ కలెక్టర్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top