భవిష్యత్‌లో సైబర్‌ నేరాలు పెరిగే ప్రమాదం

Cyber Crimes Percentage Hikes in Hyderabad - Sakshi

నేరస్తుల గుర్తింపులో టెక్నాలజీ ప్రముఖ పాత్ర

ఇప్పటివరకు రూ.7 లక్షల కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ నేరస్తులు  

సీపీలు అంజనీకుమార్, సజ్జనార్‌

బంజారాహిల్స్‌:  రాబోయే రోజుల్లో సైబర్‌ నేరాలతో పాటు ఆర్థికపరమైన నేరాలు ఎక్కువయ్యే ప్రమాదముండటంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు  పోలీసు శాఖతో పాటు ఇతర విభాగాలన్నీ సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. అసోసియేషన్‌ ఆఫ్‌ సర్టిఫైడ్‌ ఫ్రాడ్‌ ఎగ్జామినర్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని హయత్‌ప్లేస్‌ హోటల్‌లో ఫ్రాడ్‌ అండ్‌ ఫ్యూచర్‌ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ౖసైబర్‌ నేరాలు, ఆర్థికపరమైన మోసాలు, వైట్‌కాలర్‌ నేరాలను ఏ విధంగా అరికట్టాలి, నేరాలకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఎలాంటి వ్యూహాలు అవసరం అనే అంశాలపై నిపుణులు చర్చించారు. సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా పని చేసేలా ప్రభుత్వం అనేక మార్పులు తీసుకు వచ్చిందన్నారు.  నేరాలు, దోపిడీలు తగ్గుముఖం పట్టాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, ఫేస్‌ రికగ్నయిజింగ్‌ సిస్టమ్‌ పలు టెక్నాలజీల సహాయంతో నేరస్తులు ఎక్కడున్నా గుర్తించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌కు న్యూయార్క్‌ నగరంతో అనేకక సారూప్యతలు ఉన్నాయని ఆయన  అన్నారు.

హైదరాబాద్‌ జనాభా 8.6 మిలియన్లు కాగా న్యూయార్క్‌ జనాభా 8.9 మిలియన్లు అన్నారు.  ప్రపంచం మొత్తంలో న్యూయార్క్‌ పోలీసింగ్‌ మెరుగైనదని అందరూ అనుకుంటున్నారన్నారు. అయితే హైదరాబాద్‌తో పోలిస్తే న్యూయార్క్‌లో హత్యలు అయిదురెట్లు ఎక్కువని, గన్‌ఫైరింగ్‌ కేసులు 200 రెట్లు, మహిళలపై నేరాలు పదిరెట్లు అధికంగా నమోదవుతున్నాయన్నారు. దీనిని బట్టి చూస్తే న్యూయార్క్‌కంటే హైదరాబాద్‌ నగరంలో నేరాలు తక్కువేనన్నారు. రానున్న కాలంలో సాంప్రదాయ నేరాల స్థానంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దీనికి కారణం అన్ని విషయాల్లో కంప్యూటర్, చిప్‌ల వినియోగం పెరిగిపోవడమమేన్నారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ ఆర్థికపరమైన నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇప్పటిదాకా ఆర్థికపరమమైన నేరాలు, మల్టీలెవల్‌ మార్కెటింగ్,ఫోమ్‌ జి మోసాలతో సుమారు 7 లక్షల కోట్ల సొమ్మును సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. 

మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కోసం దేశంలో పటిష్టమైన చట్టం ఉన్నప్పటికీ ఆమ్‌వే లాంటి సంస్థలు డైరెక్ట్‌ సెల్లింగ్‌ ముసుగులో దేశంలో ప్రవేశించి వేల కోట్ల రూపాయలను దండుకున్నాయన్నారు. ఆమ్‌వే సంస్థపై తొలిసారిగా 2008లో కేసు నమోదు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అని అన్నారు. ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడానికి అనేక అడ్డంకులు వచ్చాయని ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి మోసాలు తగ్గుతాయన్నారు. ఏపీ అదనపు డీజీపీ అమిత్‌ గార్గ్, ఏసీఎఫ్‌ఈ హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడు శరత్‌కుమార్, ఉపాధ్యక్షుడు జేసీఎస్‌.శర్మ, రాధాకష్ణరావు, కష్ణశ్రాíస్తి పెండ్యాల,మణి పద్మనాభం,  చంద్రశేఖర్, విఠల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top