ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ‘ఏఐ’  | Curriculum on Artificial Intelligence in Engineering Colleges | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ‘ఏఐ’ 

Jan 3 2020 2:22 AM | Updated on Jan 3 2020 2:25 AM

Curriculum on Artificial Intelligence in Engineering Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను (ఏఐ) ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించిన సిలబస్‌ను రూపొందించడంతోపాటు ఏయే కాలేజీల్లో ప్రారంభించాలో నిర్ణయించేందుకు ఉన్న త స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సబ్జెక్టుగానే కాకుండా వీలైతే ప్రత్యేక కోర్సుగా ప్రవేశపెట్టే అంశాన్ని కూడా పరిశీలించాలని కమిటీని కోరాలని భావిస్తోంది. ఏఐని సబ్జెక్టుగా ప్రారంభిస్తే అందుకు అవసరమయ్యే అధ్యాపకులు, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు, సిలబస్‌ రూపకల్పన, ఎన్ని క్రెడిట్స్‌ కేటాయించాలన్న తదితర అంశాలను కమిటీ తేల్చుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఏఐపై అవగాహన కలిగిన నిపుణులకు ఆ కమిటీలో స్థానం కల్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ఏఐ సబ్జెక్టును వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ నెలాఖరులోగా కమిటీని ఏర్పాటు చేసి నివేదికను త్వరగా తెప్పించుకోవాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్‌లో ఏఐని ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే జేఎన్‌టీయూ సెనేట్‌ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర ఐటీ శాఖ కూడా ఏఐ పాలసీని రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.  

ప్రారంభమైన కసరత్తు.. 
జేఎన్‌టీయూ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఏఐని ప్రవేశపెట్టేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునేలా మండలి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని ఆయన సూచించినట్లు తెలిసింది. కోర్సుగా ప్రవేశపెడితే అన్ని ప్రైవేటు కాలేజీల్లో అమలు సాధ్యం అవుతుందా? లేదా? అనేది కమిటీ తేల్చనుంది. కోర్సును కేవలం యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనే ప్రవేశపెట్టడంతోపాటు ముందుకు వచ్చే ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలు చేస్తోంది. అయితే నిపుణులతో కూడిన కమిటీ చేసే సిఫారసుల ఆధారంగానే ముందుకు వెళ్లాలని భావిస్తోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement