పగులుతున్న అక్రమాల పుట్ట

Corruption In Power Distributing Metres Hyderabad - Sakshi

తీగలాగే కొద్దీ కదులుతున్న అక్రమాల డొంక

అక్రమ మీటర్ల బిగింపు వ్యవహారంపై బిగుస్తున్న ఉచ్చు

సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో అంతర్గత విచారణ షురూ  

సాక్షి, సిటీబ్యూరో: తీగలాగితే డొంక కదిలిన చందంగా దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో మీటర్‌ రీడింగ్‌లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. సెక్షన్ల వారీగా విద్యుత్‌ సరఫరా, నెలవారీ బిల్లులపై ఎప్పటికప్పుడు సమీక్షించి, లోపాలను సరిదిద్దాల్సిన డివిజనల్, అసిస్టెంట్‌ ఇంజనీర్లు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన బిల్లులో ఎక్కువ శాతం సొంతఖాతాల్లోకి మళ్లించి, సాధారణ బిల్లులను డిస్కం ఖాతాలో జమ చేస్తుండటం విశేషం. సరూర్‌నగర్‌ డివిజన్‌ హయత్‌నగర్‌ సెక్షన్‌ పరిధిలోని వీరభద్రనగర్‌కు చెందిన ఓ వినియోగదారుడు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం 2012లో డిస్కంకు దర ఖాస్తు చేసుకోగా, ఆయనకు త్రీఫేజ్‌ మీటర్‌ జారీ చేశారు.

మొదట్లో నెలకు సగటున 250 యూనిట్ల వరకు మీటర్‌ రీడింగ్‌ నమోదైనప్పటికీ...ఆ తర్వాత కొద్ది రోజులకే అది వేలల్లోకి చేరింది. మీటర్‌ కాలిపోయిందనే ఫిర్యాదు పేరుతో తొలిసారిగా 2013 సెప్టెంబర్‌లో పాతమీటర్‌ను మార్చి దాని స్థానంలో కొత్త మీటర్‌ అమర్చారు. ఆ తర్వాత 2014 డిసెంబర్, 2015 నవంబర్, 2016 జులై, 2016 అక్టోబర్, 2017 అక్టోబర్, 2018 మేలో మరో సారి, ఇలా ఏడాదికో సారి చొప్పున మొత్తం ఏడు సార్లు మీటర్లు మార్చడం గమనార్హం. అధిక మొత్తంలో రీడింగ్‌ నమోదైన ప్ర తిసారీ ఏదో ఒక సాంకేతిక కారణం చూపి మీ టర్‌ మార్చడం పరిపాటిగా మారింది. ఇలా ఒక ఏడాది 1120 యూనిట్లు రికార్డు కాగా.. మరో ఏడాది 4000 యూనిట్లకుపైగా నమోదైంది. ఇలా రీడింగ్‌ పెరిగిన ప్రతిసారి మీటర్లు మార్చడంలో ఆంతర్యమేమిటో సంబంధిత అధికారులకే తెలియాలి.

వసూలు వేలల్లో..సంస్థకు వందల్లో
ఇలా మీటర్‌ మార్చిన ప్రతిసారి సుమారు మూడువేలకుపైగా యూనిట్ల వ్యతాసం ఉండేది. ఎప్పటికప్పుడు వినియోగదారుని నుంచి పూర్తి బిల్లు వసూలు చేస్తున్నప్పటికీ..సంస్థ ఖాతాలో జమైంది మాత్రం వందల్లోనే కావడం గమనార్హం. రీడింగ్‌ భారీగా నమోదైన ప్రతిసారి స్టకప్, బరŠట్న్‌ వంటి సాంకేతిక కారణాలు చూపి వేలల్లో నమోదైన రీడింగ్‌ను వందలోపుకు మార్చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ఈ అక్రమాల్లో భాగస్వామం ఉన్నట్లు తెలిసింది. ఒకే సర్వీసు కనెక్షన్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటం, మీటర్లు మార్చుతుండటంపై ఉన్నతాధికారులు కూడా దృష్టిసారించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే వినియోగదారుడి పేరులోని అక్షరాలు, చిరునామాలను అటు ఇటు మార్చడంతో పా టు ఒకసారి చిరునామా ఆధారంగా, మరోసారి సర్వే నెంబర్‌ ఆధారంగా పలు మీటర్లు పొందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే సెక్షన్‌ పరిధిలో మరో ఐదు మీటర్లు ఉన్నట్లు తెలిసింది.  నమోదైన మీటర్‌ రీడింగ్‌ ప్రకారం కనెక్షన్‌ లోడు కేటగిరి మారాల్సి ఉన్నా..చాలా మీటర్లు ఒక కిలోవాట్‌ పరిధిలోనే బిల్లులు జారీ అవుతున్నాయి. 

అక్రమాలపై కూపీ లాగుతున్నాం
విద్యుత్‌ మీటర్లలో తలెత్తుతున్న సాంకేతికలోపాలు, వాటిస్థానంలో కొత్త మీటర్ల ఏర్పాటు, ప్యానల్‌ బోర్డుల కేటాయింపు అంశంపై కూపీ లాగుతున్నాం. ఇప్పటికే ఓల్డ్‌బోయిన్‌పల్లి ఘటనలో లైన్‌మెన్‌ సహా ఏఈలను సస్పెండ్‌ చేశాం. సరూర్‌నగర్‌ డివిజన్‌ హయత్‌నగర్‌ సెక్షన్‌ పరిధిలో చోటు చేసుకున్న అక్రమాలపై కూడా ఆరా తీస్తున్నాం. ఇప్పటికే  సర్వీస్‌ నంబర్ల ఆధారంగా సమగ్ర విచారణకు ఆదేశించాం. ఒకటి రెండు రోజుల్లో పూర్తి నివేదిక వచ్చే అవకాశం ఉంది. సంస్థ ఖజానాకు గండికొట్టే వారెంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. –శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, ఆపరేషన్స్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top