రోజుకు 7,600 పరీక్షలు! 

Coronavirus: 7600 Corona Tests In Telangana - Sakshi

త్వరలోనే ఏర్పాట్ల పూర్తికి యంత్రాంగం కసరత్తు 

ప్రస్తుతం ప్రభుత్వ ల్యాబ్‌ల్లో 

2,290 పరీక్షల సామర్థ్యం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏరా ట్లు చేస్తోంది. ప్రస్తుతం చేస్తున్న పరీక్షల్లో ఎక్కువ శాతం పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. ఈ క్రమంలో మరిన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగిరం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ల్యాబ్‌ల్లో 2,290 పరీక్షలు నిర్వహించే సామర్థ్యం మాత్రమే ఉంది. రాష్ట్రంలో అన్ని ల్యాబ్‌లు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి.

తాజాగా నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, ట్రూనాట్‌ సెంటర్లలో కొత్తగా 1,100 పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచనుంది. ఈ ప్రక్రియ వారంలోగా పూర్తవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండ్రోజుల్లో హైదరాబాద్‌లోని ల్యాబ్‌ల్లో మరో 3,210 పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. కొత్త గా సీబీనాట్‌లో వెయ్యి పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ల్యాబ్స్‌లో రోజుకు 7,600 పరీక్షలు జరగనున్నాయి. 

వందలో 14 మందికి పాజిటివ్‌ 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్న ప్రతి వంద మందిలో 14 మందికి ఈ వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా టెస్టుల పాజిటివ్‌ రేట్‌(టీపీఆర్‌) 14.39 శాతానికి ఎగబాకడమే ఇందుకు నిదర్శనం. జాతీ య స్థాయిలో ఇది 6.11 శాతం ఉండగా, రాష్ట్రం లో రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్‌ 28 నాటికి రాష్ట్రంలో 5.2 శాతం మాత్రమే టీపీఆర్‌ ఉండగా, మే 14 నాటికి 6.07 శాతానికి పెరిగింది.

ఆ తర్వాత మే 15 నుంచి జూన్‌ 16 మధ్య కాలంలో రెట్టింపు అయింది. జూన్‌ 16న 12.6 శాతానికి పెరగ్గా.. ప్రస్తుతం 14.39 శాతానికి ఎగబాకింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే రాష్ట్రంలో వైరస్‌ చాప కింద నీరులా వ్యాప్తి చెందినట్టు తెలుస్తోంది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో కరోనా నిర్థారణ కోసం పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో 20 మందికి వైరస్‌ సోకినట్టు ఫలితాలొస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న జీహెచ్‌ఎంసీతో పాటు పరిసర జిల్లాల పరిధిలోని 30 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో గత వారం రోజులుగా టెస్టుల సంఖ్యను పెంచడంతో పాజిటివ్‌ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top