విద్యా వాలంటీర్లను కొనసాగించండి | Continue with educational volunteers | Sakshi
Sakshi News home page

విద్యా వాలంటీర్లను కొనసాగించండి

Mar 24 2019 2:29 AM | Updated on Jul 11 2019 5:24 PM

Continue with educational volunteers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్‌ నియామకాలు చేపట్టనప్పుడు, ఆ నియామకాలు జరిగేంత వరకు అందులో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను తొలగించాలంటే రెగ్యులర్‌ నియామకాలు చేసినప్పుడే తొలగించాలంది. ఓ తాత్కాలిక ఉద్యోగిని మరో తాత్కాలిక ఉద్యోగితో భర్తీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అయితే సెలవు పెట్టిన ఉపాధ్యాయుల స్థానంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా విద్యా వాలంటీర్లను నియమించి ఉంటే, ఆ ఉపాధ్యాయుడు సెలవు ముగించుకుని వచ్చిన తరువాత సదరు విద్యా వాలంటీర్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అలాగే అర్హతలు లేని విద్యా వాలంటీర్లను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని కూడా స్పష్టం చేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ఇటీవల తీర్పు వెలువరించారు. విద్యా వాలంటీర్లుగా ఏడాది కాలం పాటు పనిచేసినా తమను కొనసాగించకుండా కొత్త వారి నియామకం కోసం చేపట్టిన ప్రక్రియను సవాలు చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన భిక్షం, మరో 98 మంది హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ఇటీవల విచారణ జరిపి తీర్పు వెలువరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్‌ నియామకాలు జరిగేంత వరకు ప్రస్తుతం ఉన్న విద్యా వాలంటీర్లు కొనసాగవచ్చునని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. 2019–20 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలు, ఎంత మంది విద్యా వాలంటీర్ల అవసరం ఉంది తదితర విషయాలపై అధ్యయనం చేయాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి విద్యా వాలంటీర్లను నియమించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉందని, అయితే ప్రస్తుతం పనిచేస్తున్న వారినే కొనసాగించడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్నారు. తగిన అర్హతలు లేని విద్యా వాలంటీర్లను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందన్న ప్రభుత్వ న్యాయవాది వాణీరెడ్డి వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఆ అధికారం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement