సిరిసిల్లలో మాటల మాంత్రికులు..

Contestents Showing Interest Over Sircilla Singers For Municipal Elections   - Sakshi

సాక్షి, సిరిసిల్ల: ‘చిన్నా.. అంటే.. నేనున్న అన్నా అని వచ్చే నాయకుడు.. మన ఆకుల చిన్న.. ఓటరు మహాశయులారా.. మీ అమూల్యమైన ఓటును మన ఆకుల చిన్న గుర్తుకు వేయండి..ఒక్క నాటి పొరపాటు.. కాకూడదు ఐదేళ్ల గ్రహపాటు.. ఆలోచించండి.. మీ ఓటును.. అభ్యర్థికి వేయండి’’ అంటూ వినిపించే గొంతుకలు అవి. ‘బడుగు బలహీన వర్గాల నేత మన స్థానికుడు. ఏ రాత్రి పిలిచినా నేనున్నానని పరుగెత్తుకొచ్చే నిస్వార్థ ప్రజాసేవకుడు మన అన్న’.. అంటూ అభ్యర్థి పక్షాన ప్రచారం. ‘వట్టి మాటలు కట్టిపెట్టండి.. మన ప్రాంతానికి గట్టిమేలు తలపెట్టే నేతను ఎన్నుకోండి. మాయమాటలతో వచ్చేవాళ్ల మాటలు నమ్మకండి.. సమస్యల సుడిగుండంలో ఉన్న మన వార్డులో అభివృద్ధికి పాటుపడే వ్యక్తికి ఓటేద్దాం.

వాగ్ధానాలను నమ్మకండి.. మాట మీద ఉండి మనకు సేవ చేసే వ్యక్తులకే ఓట్లు వేయండి.. నోటుకు ఓట్లు అమ్ముకోకండి’.. అంటూ ఓటర్లను అప్రమత్తం చేసే ఆ గొంతుకలు సిరిసిల్లవి. నాలుగు దశాబ్దాలుగా ప్రచార రంగంలో వినిపిస్తున్న సిరిసిల్ల స్వరాలివి. వాణిజ్య ప్రకటనలే కాదు.. ఎన్నికల ప్రచార పర్వంలో ఆ గొంతులకు ప్రత్యేక స్థానం. పాటలు మధ్యమధ్యలో మాటల తూటాలు. ప్రజలకు స్పష్టంగా గుండెలకు హత్తుకునేలా, అర్థమయ్యేలా చెప్పడమే కాదు ఒక్క క్షణం ఆలోచింపజేసే మాటల తూటాలు పేల్చే మాటల మాంత్రికులు వాళ్లు. పార్టీ ఏదైనా ఎజెండాలు ఏవైనా ప్రచారం చేసే గొంతుకలు అవి. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా అనౌన్సర్లుగా రాణిస్తున్నారు.

నాలుగు దశాబ్దాలుగా..
1974లో పద్నాలుగేళ్ల ప్రాయంలో మొదటిసారిగా అనౌన్సర్‌ అయ్యాను. అప్పట్నుంచి వివిధ వ్యాపార, వాణిజ్య ప్రకటనలకు వ్యాఖ్యాతగా పని చేస్తున్న. ఎన్నికల సీజన్‌లో తీరిక లేకుండా ప్రచార ప్రకటనలు వస్తాయి. ఆదిలాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల నుంచి చాలా మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇచ్చి మరీ రికార్డింగ్‌లు అడుతున్నారు. ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తూ రికార్డ్‌ చేస్తా. ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా 155 మందికి ప్రచార ప్రకటనలు చేసిన. ఒక్కో దానికి సమయాన్ని బట్టి.. వాళ్ల డిమాండ్‌ను బట్టి డబ్బులు తీసుకుంటాం. అంతా ఆన్‌లైన్‌లోనే వ్యాపారం 
సాగుతుంది.
– ఎండీ సలీం, గోరెమియా సౌండ్స్, రాజన్న సిరిసిల్ల

పాటలు.. మాటలతో..
ఎన్నికల్లో పోటీ చేసినవారి పేరు, గుర్తు, ప్రాంతం పేరు చెబితే చాలు పాటలతో పాటు వ్యాఖ్యానం జోడిస్తాను. 15 ఏళ్లుగా ఈ రంగంలో పని చేస్తున్న. మా బాబాయి ప్రదీప్‌కుమార్‌ స్ఫూర్తితో ఈ రంగంలోకి వచ్చిన. పలు జిల్లాల నుంచి అభ్యర్థులు వచ్చి రికార్డులు చేయించుకుంటున్నారు. ఒక్కో ప్రచారానికి రూ.2000 నుంచి రూ.3000 వేల వరకు తీసుకుంటున్న.

నా గొంతుతో పాటు మరో మహిళ గొంతును కూడా జోడించి ప్రచారం చేస్తాం. బయట జిల్లాల గిరాకే ఎక్కువ. చిన్నప్పట్నుంచే ఈ రంగంపై ఆసక్తితో వ్యాఖ్యాతగా ఉంటున్న. ఎన్నికల ప్రచారం చేయడం ఆనందంగా ఉంది. అందరు నాయకులకు నా గొంతుతో ప్రచారం చేయడం బాగుంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్‌లో 260 మంది ఆర్డర్లు తీసుకుని రికార్డు చేసిన.         
– సాంబారి రాజు, వ్యాఖ్యాత, రాజన్న సిరిసిల్ల

45 ఏళ్లుగా..
45 ఏళ్లుగా వ్యాఖ్యాతగా పని చేస్తున్న. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తొలి వ్యాఖ్యాత నేనే కావచ్చు. 12 ప్రాయంలోనే ప్రకటనలకు వాయిస్‌ అందించిన. ఎన్నికల సమయంలో ప్రకటనలకు చాలా మంది వస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వంద మందికి రికార్డింగ్‌ చేసిన. ప్రభుత్వ పరంగా అనేక ప్రకటనలు నేనే రికార్డ్‌ చేశా. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రచారం చేయడం ఆనందంగా ఉంది. ఇతర రోజుల్లో పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అంశాలపై కూడా ప్రచారం చేసిన.
– షేక్‌ ఖాజా, శేఖ్‌ చాంద్‌ సౌండ్స్, రాజన్న సిరిసిల్ల

అభ్యర్థులను ఆకట్టుకునేలా..
ఏదైనా అంశం ఇస్తే చాలు.. వారిని ఆకట్టుకునేలా స్క్రిప్ట్‌ రాస్తా. హైదరాబాద్‌లో ఎంబీఏ చేసిన. మాటలు, పాటలు సందర్భానికి అనుగుణంగా రాయడం నా వంతు. వ్యాఖ్యాతగానూ వ్యవహరించిన. ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే 200 మందికి మాటలు రాసిన. కానీ ఈ సారి ఎక్కువ సమయం లేదు.. దీంతో హడావుడిగా రికార్డింగ్‌ చేయాల్సి వస్తుంది. మాకు మంచి ఉపాధి లభిస్తుంది.
– సాంబారి కిరణ్, స్క్రిప్ట్‌ రైటర్, రాజన్న సిరిసిల్ల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top