గర్భిణి మృతిపై ఆందోళన | Concern over killing of pregnant woma | Sakshi
Sakshi News home page

గర్భిణి మృతిపై ఆందోళన

Aug 30 2014 11:48 PM | Updated on Oct 20 2018 5:53 PM

ఓ మహిళ బాబుకు జన్మనిచ్చి మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యంతోనే యువతి మృతిచెందిందని కుటుంబీకులు ఆరోపిస్తూ ఆస్పత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

- వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ
- ఆస్పత్రిలో ఫర్నీచర్ ధ్వంసం
- వికారాబాద్‌లో ఘటన   
 వికారాబాద్ రూరల్: ఓ మహిళ బాబుకు జన్మనిచ్చి మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యంతోనే యువతి మృతిచెందిందని కుటుంబీకులు ఆరోపిస్తూ ఆస్పత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ సంఘటనవికారాబాద్ పట్టణంలో శనివారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. బంట్వారం మండలం మోత్కుపల్లి గ్రామానికి చెందిన ముష్టి ప్రభావతి(21), గురుదాస్ దంపతులకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం గర్భం దాల్చిన ప్రభావతి వికారాబాద్‌లోని హృదయ ఆస్పత్రిలో చూయించుకుంటోంది. గురువారం మధ్యాహ్నం పురుటినొప్పులు రావడంతో ఆమె ను కుటుంబీకులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ ఆశాజ్యోతి మధ్యాహ్నం 3 గంటలకు సిజేరియన్ చేయడంతో బాబు జన్మించాడు. కొద్దిసేపటికి ప్రభావతికి రక్తస్రావం అవడంతో కడుపులో తీవ్ర నొప్పిగా ఉందని అమ్మమ్మ రుక్కమ్మకు చెప్పింది. ఈ విషయాన్ని రుక్కమ్మ డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా వైద్యులు స్పందించలేదని కుటుంబీకులు చెబుతున్నారు.

రాత్రి 9 గంటల తర్వాత డాక్టర్ వచ్చి ప్రభావతి పరిస్థితి విషమించిందని చెప్పారు. వైద్యురాలి భర్త డాక్టర్ మధుసూధన్‌రెడ్డి ఓ ప్రైవేట్ వాహనంలో ప్రభావతితో పాటు రుక్కమ్మను తీసుకొని హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే ప్రభావతి మృతి చెందిందని నిర్ధారించారు. శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని వికారాబాద్‌లోని హృదయ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మృతురాలి  బంధువులు ప్రభావతి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
 
డాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రభావతి చనిపోయిందని ఆరోపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే యత్నం చేశారు. తమకు న్యాయం జరగాలని  భీష్మించారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో పోలీసులు మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి భర్త గురుదాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కూతురు మృతి చెందడంతో మనోవేదనకు గురైన ప్రభావతి తండ్రి మల్లయ్యకు మూర్ఛతో పడిపోయాడు. ఆయనను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా పసికందుకు గుండె కుడివైపు ఉండడంతో నిలోఫర్‌కు తరలించారు.
 
పోస్టుమార్టంకు నిరాకరించిన డాక్టర్లు..
ప్రభావతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యులు నిరాకరించారు. తమకు అనుభవం లేదని ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement