
ప్రగతి భవన్‌లో హరితహారంపై సీఎం కేసీఆర్ సమీక్ష. చిత్రంలో మంత్రులు, ఎంపీలు, అధికారులు
మొక్కలను నాటడంతో పాటు వాటిని రక్షించేందుకు రాష్ట్రంలో ఎక్కడికక్కడ గ్రీన్ బ్రిగేడ్ (హరిత సైన్యం) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.
- ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
- మొక్కలు నాటి రక్షించేందుకు ఎక్కడికక్కడ ఏర్పాటు
- విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులతో గ్రీన్ బ్రిగేడ్‌లు
- మొక్కల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలి
- 12న కరీంనగర్ నుంచి మూడో విడత హరితహారం ప్రారంభం
- ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు సీఎం పిలుపు
సాక్షి, హైదరాబాద్: మొక్కలను నాటడంతో పాటు వాటిని రక్షించేందుకు రాష్ట్రంలో ఎక్కడికక్కడ గ్రీన్ బ్రిగేడ్ (హరిత సైన్యం) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మొక్కలు నాటడంతో వదిలేయకుండా వాటిని రక్షించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 12న ప్రారంభం కానున్న మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిత సైన్యం ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
‘‘కరీంనగర్ పట్టణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ నెల 12న నేనే లాంఛనంగా ప్రారంభిస్తాను. అదే రోజున నగరంలో దాదాపు 25 వేల మొక్కలు నాటాలి. ఆ మరుసటి రోజు నుంచి రోజుకు 5 వేల మొక్కలు నాటాలి. ఏకకాలంలో మొక్కలు నాటడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. గుంతలు తీయడం, ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడానికి అవసరమైన 25 వేల మందిని సమీకరించడం తదితర కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి. మొక్కలు నాటే సమయానికి మసీదుల్లో సైరన్ మోగే ఏర్పాటు చేయాలి. సైరన్ మోగగానే మొక్కలు నాటాలి. కరీంనగర్ పట్టణంలో 50 డివిజన్లున్నాయి. ప్రతి డివిజన్‌కు ఒక అధికారి లేదా ప్రజాప్రతినిధిని బ్రిగేడియర్‌గా పెట్టాలి. ప్రతీ డివిజన్‌లో విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడ్‌లను తయారు చేయాలి..’’. అని ముఖ్యమంత్రి సూచించారు.
రాష్ట్రమంతటా గ్రీన్ బ్రిగేడ్
రాష్ట్రం మొత్తం మీద కూడా గ్రీన్ బ్రిగేడ్‌లు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఎక్కడికక్కడ విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులతో బ్రిగేడ్ ఏర్పడాలని... సీనియర్ అధికారి లేదా ప్రజాప్రతినిధి బ్రిగేడియర్‌గా వ్యవహరించాలని సూచించారు. మొక్కలు నాటడం, దానికి ట్రీగార్డు పెట్టడం, వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు, ఎండాకాలంలో వాటికి నీళ్లు పోయడం, దీనికోసం నీటి ట్యాంకర్లను సమకూర్చుకోవడం వంటి పనులన్నీ ఆ గ్రీన్ బ్రిగేడ్‌లు చేయాలన్నారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని రక్షించడం కూడా అంతే ముఖ్యమని భావించాలని స్పష్టం చేశారు.