ఆత్మహత్యలు వద్దని వేడుకుంటున్న: కేసీఆర్‌

CM KCR Respond On Inter Students Suicides - Sakshi

పరీక్షలో ఫెయిలైతే.. జీవితంలో ఫెయిలైనట్లు కాదు: కేసీఆర్‌

తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగల్చొద్దు

ఇంటర్మీడియట్‌ విద్యార్థులను కోరిన ముఖ్యమంత్రి

ఫెయిలైన అందరికీ ఉచితంగా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌

విద్యామంత్రి, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి

స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణకు యోచన

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలపై ఆందోళనతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్‌లో ఫెయిలైనంత మాత్రాన జీవితం ఆగిపోదని, విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ‘ఇంటర్మీడియట్‌లో ఫెయిలయ్యామనే బాధతో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధపడ్డా. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరం. ఇంటర్మీడియట్‌ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలైతే.. జీవితంలో ఫెయిలైనట్లు కాదు. ప్రాణం చాలా విలువైంది. పరీక్షల్లో ఫెయిలైనప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాణించాలి.

జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే మీ తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుంది. అది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్నా’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరమైన సంఘటనలని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎంవో కార్యదర్శులు రాజశేఖర్‌ రెడ్డి, భూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులకు ఉపశమనం కలిగించే చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌ చేయాలని ఆదేశించారు. పాసైన విద్యార్థులు కూడా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకొని చేయాలని సీఎం చెప్పారు. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌ ప్రక్రియను వీలైలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌›డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్, అడ్వాన్స్‌›డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
 
తల్లిదండ్రుల అనుమానాల నివృత్తికి చర్యలు
‘ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాశారు. వారిలో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. కాబట్టి వారి అనుమానాలు నివృత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ–వెరిఫికేషన్‌ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్‌ను రీ–వెరిఫికేషన్‌ చేయాలి. రీ–కౌంటింగ్‌ చేయాలి. పాసైన విద్యార్థులకు కూడా రీ–వెరిఫికేషన్‌ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ వెరిఫికేషన్‌ చేయాలి. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించాలి. నీట్, జేఈఈ లాంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరుకావాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా అడ్వాన్స్‌›డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’అని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
 
సమస్యల్లేని పరీక్షల విధానం
‘ఇంటర్మీడియట్‌తో పాటు ఎంసెట్‌ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతిసారీ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి ఏడాదీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వం కూడా అనవసరంగా తలనొప్పులు భరిస్తోంది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో ఎలా అమలు చేయగలమో ఆలోచించాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పుల్లేని పరీక్షావిధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలెత్తుతున్న తలనొప్పులు నివారించడం కూడా అసాధ్యమేదీ కాదు’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
 
సాఫ్ట్‌వేర్‌ సంస్థపైనా ఆరా
ఇంటర్మీయట్‌ విద్యార్థుల డేటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ–ప్రొక్యూర్‌మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజెన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోట్‌ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యంపై సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకుందని వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top