ప్రశ్నించేవారు ఉండొద్దనే విలీనం | CM and Speaker are cheating Telangana people Says Uttam kumar | Sakshi
Sakshi News home page

ప్రశ్నించేవారు ఉండొద్దనే విలీనం

Jun 9 2019 6:04 AM | Updated on Sep 19 2019 8:44 PM

CM and Speaker are cheating Telangana people Says Uttam kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అక్రమాలను శాసనసభలో ప్రశ్నించేవారు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను భయపెట్టి, దుర్మార్గంగా కొనుగోలు చేసి పార్టీని విలీనం చేస్తున్నట్టు ప్రకటించారని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేశారని.. సీఎం, స్పీకర్‌ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్‌ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరిస్తారని తాము భావించలేదని, వీరు చేస్తున్న మోసం కారణంగా కాంగ్రెస్‌ పార్టీ కంటే తెలంగాణ ప్రజలకే ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు.

సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శనివారం ఇందిరాపార్కు వద్ద 36 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు హాజరైన సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్షం లేకుండా చేస్తే ఏ సమస్యలపైనా ప్రశ్నించేవారు ఉండరనే ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేల కొనుగోలుపైనే కేసీఆర్‌ దృష్టి సారించారని విమర్శించారు. ఫిరాయిం పు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తాము కోరినప్పటికీ, సీఎల్పీ నేత హోదాలో భట్టి లేఖ ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు.

తాము స్పీకర్‌కు ఫోన్‌ చేస్తే కనీసం స్పందించలేదని, కానీ అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు మాత్రం రహస్య ప్రదేశం లో సమయం ఇచ్చారని విమర్శలు గుప్పించారు. దళితుడు ప్రతిపక్ష నేతగా ఉండడం కేసీఆర్‌కు ఇష్టమో లేదో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాము ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటామని, కాంగ్రెస్‌ పార్టీని అణచివేయాలనుకునేవారి ఆటలు సాగనివ్వబోమని ఉత్తమ్‌ హెచ్చరించారు.

కేసీఆర్‌ మొదలుపెట్టారు: భట్టి
తాను చేపట్టిన ఈ దీక్ష కాంగ్రెస్‌ పార్టీది మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానిదని భట్టి విక్రమార్క అన్నా రు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతున్న సమయంలో కేసీఆర్‌ రాజకీయ టెర్రరిజాన్ని అడ్డుకునేందుకే తాను ఈ దీక్షకు కూర్చున్నట్టు వెల్లడించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు లేఖ ఇచ్చినా పట్టించుకోలే దని ఆవేదన వ్యక్తంచేశారు. రిఫరీగా ఉండాల్సిన స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరించారని, తమను కలిసేందుకు అంగీకరించని ఆయన.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మాత్రం ఎలా కలుస్తారని, ఇదెక్కడి న్యాయ మని ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ గురించి శాసనసభలో అడిగినందుకే సీఎల్పీనే లేకుండా చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారని ఆరోపించారు.

అయినప్పటికీ తమ పోరాటం ఆపేది లేదని, కేసీఆర్‌ అవినీతి లెక్కలను తేలుస్తామని ఉద్ఘాటించారు. కేసీఆర్‌ అవినీతిపై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తామని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆయన వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక తీరుపై రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. కేసీఆర్‌ అట మొదలుపెడితే తాము దానికి ముగింపు ఇస్తామని, ఆయన అవినీతి మూలాలను బయటపెట్టి తీరతామన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం సంక్షోభంలో పడిందని, ఈ సమయం లో గవర్నర్‌ మౌనంగా ఉండడం మంచిది కాదన్నా రు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని, కేసీఆర్‌పై ఈ పోరాటం అంతం కాదని, ఆరంభం మాత్రమేనని వ్యాఖ్యానించారు.

నీచ రాజకీయాలకు పరాకాష్ట: జైపాల్‌
నీచ రాజకీయాలకు కేసీఆర్‌ పరాకాష్టగా మారారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం ప్రజాస్వామ్యంలోనే చీకటి రోజని వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు పరిమితమైన హక్కులు మాత్రమే ఉన్నాయని, కాంగ్రెస్‌ను చీల్చడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. దీనిపై హైకోర్టులో గెలిచి తమ తడాఖా చూపుతామని వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా మాట్లాడుతూ.. సీఎల్పీని అక్రమం గా విలీనం చేశారని అన్నారు.

స్పీకర్‌ పరిధిలో ఈ అంశంపై ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగా ఎలా విలీ నం చేస్తారని, పీసీసీ అధ్యక్షుడి అనుమతి లేకుండా ఆ 12 మంది నిర్వహించిన సమావేశం ఎలా చెల్లుతుం దని ప్రశ్నించారు. దళితుడైన భట్టి ప్రతిపక్ష నేతగా ఉండటం కేసీఆర్‌కు నచ్చలేదని అన్నారు. మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. పరిపాలన చేయమని అధికారమిస్తే కేసీఆర్‌ అప్రజాస్వామికం గా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ అప్రజాస్వామిక విధానాలను చూస్తూ ఊరుకోబోమని, ఆయన తీరుపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.  

పార్టీల వ్యవస్థ కుప్పకూలుతుంది..
భట్టి విక్రమార్క చేపట్టిన దీక్షకు టీజేఎస్, టీడీపీ, సీపీఐ సంఘీభావం ప్రకటించాయి. టీజేఎస్‌ అధ్యక్షు డు కోదండరాం, టీటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి దీక్షకు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు కొనసాగితే పార్టీల వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. నేతలు ఏ వేదికలో గెలిచారో ఆ వేదికలో ఉంటేనే స్థానిక ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు కాలపరిమితి లేకపోవడంతోనే జాప్యం చేస్తున్నారని, స్పీకర్‌ ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వకపోతే సభలో ప్రజల పక్షాన ఎవరు పోరాడాలని కోదండరాం ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికే నష్టమని, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అధ్వాన పాలన సాగుతోందని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ దీక్షలో కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, సీతక్క, వీహెచ్, జీవన్‌రెడ్డి, కుసుమకుమార్, జగ్గారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోదండరెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

ఆమరణ దీక్షగా మార్పు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన 36 గంటల దీక్షను ఆమరణ దీక్షగా మార్చారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీక్షా వేదిక నుంచి ప్రకటించారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్కరూ ఈ దీక్షకు హాజరై సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement