క్రిస్మస్‌కు సర్కారు కానుక

Christmas gift from the government - Sakshi

2.13 లక్షల కుటుంబాలకు వస్త్రాల పంపిణీ

18న 2 లక్షల మందికి విందు భోజనం  

 రూ.15 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: క్రిస్‌మస్‌ పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేద క్రిస్టియన్‌ మైనార్టీ కుటుంబాలకు కానుక ఇవ్వబోతోంది. దాదాపు 2.13 లక్షల కుటుంబాలకు కొత్త వస్త్రాలను ఇవ్వాలని, రుచికరమైన వంటకాలతో విందు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు రూ.15 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు వస్త్రాల పంపిణీ, విందు ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

గిఫ్ట్‌ప్యాక్‌ రూపంలో..
రాష్ట్రంలో 2.13 లక్షల పేద క్రిస్టియన్‌ కుటుంబాలున్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వారికి ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా 313 కేంద్రాల్లో విందు భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ విక్టర్‌ తెలిపారు. ఇక పేద క్రిస్టియన్‌ కుటుంబాలకు ఇచ్చే నూతన వస్త్రాలను గిఫ్ట్‌ప్యాక్‌ రూపంలో అందజేయనున్నారు. పురుషులకు ప్యాంటు, షర్ట్, మహిళలకు చీర, రవిక, బాలికలకు డ్రెస్‌ మెటీరియల్‌ అందులో ఉంటాయి. ఇప్పటికే వస్త్రాలను కొనుగోలు చేసిన అధికారులు గిఫ్ట్‌ప్యాక్‌లను సిద్ధం చేస్తున్నారు. భారీ మొత్తంలో పంపిణీ ప్రక్రియ ఉండటంతో పక్కాగా పర్యవేక్షిస్తున్నట్లు విక్టర్‌ తెలిపారు.

పంపిణీలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, క్రిస్‌మస్‌ పండుగలోపు పంపిణీ పూర్తిచేస్తామని చెప్పారు. ఇక ఈనెల 22న బిషప్‌లు, పాస్టర్లు, ఇతర క్రైస్తవ ప్రముఖులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాం కాలేజీ మైదానంలో విందు ఏర్పాటు చేశారని తెలిపారు. విశిష్ట సేవలందించిన క్రైస్తవ ప్రముఖులు, సంస్థలకు సీఎం చేతుల మీదుగా అవార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top