పులి చర్మాల దందాలో చంద్రాపూర్‌ గ్యాంగ్‌!  | Chandrapur Gond For Hunting Tiger | Sakshi
Sakshi News home page

పులి చర్మాల దందాలో చంద్రాపూర్‌ గ్యాంగ్‌! 

Jan 30 2019 1:33 AM | Updated on Jan 30 2019 1:33 AM

Chandrapur Gond For Hunting Tiger - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రిలో పులి చర్మాన్ని విక్రయిస్తూ ముగ్గురు వ్యక్తులు అటవీశాఖకు చిక్కడంతో మొదలైన వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. వన్యప్రాణులు గుంపులుగా సంచరించే జైపూర్‌ మండలం శివ్వారం పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలతో వాటి ఉసురు తీయడం సాధారణం. ఇదే తరహాలో శివ్వారం గ్రామానికి చెందిన దంతవేని సాయిలు (45) విద్యుత్‌ తీగలను అమర్చగా, ఈ నెల 7వ తేదీ రాత్రి వేళలో పెద్దపులి ఆ తీగలకు తాకి మృత్యువాత పడింది. పులిని చూసి షాక్‌ అయిన సాయిలు సహచరులు తోకల మల్లయ్య, తోకల బుచ్చిరాజంలతో కలసి దాని చర్మాన్ని, గోళ్లను విక్రయించి, లక్షలు సంపాదించాలని భావించారు. ఈ క్రమంలో మొదలైన ‘ఆపరేషన్‌ టైగర్‌ స్కిన్‌’వ్యవహారంలో మహా రాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా వచ్చి చేరింది. పులి చర్మం కొనుగోలు చేసేందుకు ముందు గా ఫోన్‌లో లక్షల్లో బేరం మాట్లాడిన ఈ ముఠా సభ్యులు, చివరికి బ్లాక్‌ మెయిల్‌కు దిగి... అది కూడా వర్కవుట్‌ కాకపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తాము పులుల వేటను నిరోధించేందుకు ఏర్పాటైన ఎన్‌జీవో సొసైటీ సభ్యులుగా అటవీశాఖ అధికారులనే నమ్మించి పరారయ్యారు. ఈ కేసును రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అప్పగించడంతో గూడుపుఠాణి బహిర్గతమవుతోంది.
 
చంద్రాపూర్‌ ముఠాతో బేరసారాలు 
ఈ నెల7న రాత్రి పులి కరెంటు తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోగా, 8న అది చూసిన ముగ్గురు నిందితులు పులి చర్మం, గోళ్లు అమ్మితే లక్షలు సంపాదించవచ్చని భావించారు. మంథని మండలం నాగా రాని చెందిన బెజపల్లి కొమురయ్య (40), పాలకుర్తి మండలం రామారావుపల్లికి చెందిన మేకల నర్సయ్య (40)కు సమాచారం అందించారు. వీరంతా శివ్వారం వచ్చి చనిపోయిన పులిని 200 మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చర్మం, గోళ్లు ఒల్చి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. వీరికి ఆర్థిక సాయం అందించేందుకు మంచిర్యాలలో మెడికల్‌ షాపులో పనిచేసే నర్సింబోజు రవీందర్‌ (42) ఒప్పుకున్నాడు. చర్మం విక్రయించే విషయంలో గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన పూర్ణచందర్‌ను సంప్రదించారు. పూర్ణచందర్‌ ద్వారా ఆసిఫాబాద్‌కు చెందిన పాండురంగ ప్రవేశం చేశాడు. ఈ క్రమంలో మందమర్రికి చెందిన ఐలవేని అంజయ్యను కూడా తమ ముఠాలో చేర్చుకున్నారు.  

అసలు కథ పాండు ద్వారానే... 
ఆపరేషన్‌ టైగర్‌ స్కిన్‌ వ్యవహారం తాను నడిపిస్తానని, రూ.లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన పాండు.. చంద్రాపూర్‌కు చెందిన నందకిషోర్, థామస్‌కు సమాచారం ఇచ్చాడు. నందకిషోర్‌ గతంలో పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించాడు. ఈ పేరుతో దందా లు సాగిస్తున్నట్లు చంద్రాపూర్‌ పోలీసులు గమనించి దూరం పెట్టడంతో అటవీశాఖతో సంబంధాలు ఏర్పా టు చేసుకుని ఇన్‌ఫార్మర్‌ అవతారం ఎత్తాడు. . దీంతో ఏకంగా పులుల వేటను అంతం చేయడమే లక్ష్యమని ‘పులుల వేట అంతం’పేరుతో సొసైటీగా ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌కు రావాలని నందకిషోర్, థామస్‌లు సాయిలు గ్యాంగ్‌ను కోరగా, పోలీస్‌ చెకింగ్‌ భయంతో రాలేమని మందమర్రికి వస్తామని చెప్పారు. అయితే పులిచర్మం కొనుగోలు కోసం వస్తున్నట్లు చెప్పిన చంద్రాపూర్‌కు చెందిన నందకిషోర్, థామస్‌లకు బేరసారాల్లో తేడా వచ్చినట్లు సమాచారం.  ఒక పథకం ప్రకారం ముందే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన చంద్రాపూర్‌ గ్యాంగ్‌ పులి చర్మం విషయంలో బేరం కుదరకపోవడంతో పట్టించారని తెలుస్తోంది. 

నలుగురు అరెస్టు.. 
పులికి విద్యుత్‌ తీగను అమర్చి మరణానికి కారణమైన సాయిలును 5వ నిందితుడిగా చూపించి రిమాండ్‌ చేశారు. అతనితో పాటు మేకల నర్సయ్య (ఏ–3), బెజపల్లి కొమురయ్య (ఏ–4), నరింబోజు రవీందర్‌ (ఏ–6)లను రిమాండ్‌ చేశారు. ఆసిఫాబాద్‌కు చెందిన పాండు, గోదావరిఖనికి చెందిన పూర్ణచందర్, శివ్వారం తోకల మల్లయ్య , తోకల బుచ్చిరాజం, మందమర్రికి చెందిన ఐలవేని అంజ య్య, కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement