ఓ మహిళ మెడ నుంచి మంగళ సూత్రాన్ని తెంపుకుపోయే ప్రయత్నం చేసిన ముగ్గురు నిందితులకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష..
చేవెళ్ల రూరల్ : ఓ మహిళ మెడ నుంచి మంగళ సూత్రాన్ని తెంపుకుపోయే ప్రయత్నం చేసిన ముగ్గురు నిందితులకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధించింది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల మేరకు... 2014 డిసెంబర్ 11వ తేదీన సాయంత్రం చేవెళ్ల గ్రామానికి చెందిన జయశ్రీ వాకింగ్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు పుస్తెల తాడును అపహరించేందుకు ప్రయత్నించారు. పుస్తెలతాడును పట్టుకొని లాగేందుకు ప్రయత్నించగా ఆమె కేకలు వేయటంతో వారు దాన్ని వదిలిపెట్టి పరారయ్యారు. జయశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. నిందితులు దుంప ప్రవీణ్, గూడెం జైపాల్, గూడెం యాదయ్యలపై అభియోగాలు నిరూపణ కావటంతో జడ్జి అన్నపూర్ణశ్రీ పై తీర్పు వెల్లడించారు.