ప్రారంభోత్సవానికి సిద్ధం

Center For Dalit Studies Building Ready For Opening in Hyderabad - Sakshi

జూబ్లీహిల్స్‌: దళిత విజ్ఞానధామంగా భావిస్తున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ భవన నిర్మాణం పనులు చివరిదశకు చేరుకున్నాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలోని రహమత్‌నగర్‌ ఎస్పీఆర్‌ హిల్స్‌లో నిర్మిస్తున్న భవనానికి 2016 ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేయగా, 2017 నవంబర్‌లో ప్రారంభమైన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 1400 గజాల విస్తీర్ణంలో రెండు సెల్లార్లతో కలిపి మొత్తం 9 అంతస్తుల్లో దాదాపు 77,800 చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ.21 కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆడిటోరియం, కంపౌండ్‌వాల్‌ నిర్మాణం పూర్తిచేసి ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించడం సహా చిన్నపాటి ప్యాచ్‌వర్క్‌లు పూర్తిచేసి త్వరలోనే భవనాన్ని అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

బౌద్ధ సంప్రదాయం ఉట్టిపడేలా..
ఎక్కువ భాగం స్టీల్‌తో కొంత మొత్తం సిమెంట్‌తో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానమైన ‘కాంపోజిట్‌ స్ట్రక్చర్‌’ పద్ధతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన ‘ఎక్స్‌పాండెడ్‌ పాలిస్ట్రెయిన్‌ వాల్‌’(ఈపీఎస్‌) టెక్నాలజీతో దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా నిర్మాణం జరుపుకుంటోంది. పూర్తిస్థాయిలో స్టీల్‌ పిల్లర్లు నిర్మించి వాటిపై సిమెంట్‌తో స్లాబ్‌ వేస్తున్నారు. సాధారణ భవనాల నిర్మాణంతో పోలిస్తే నిర్మాణవ్యయం తగ్గుతోంది. ఈ భవనంలో కనీసం 4–5 డిగ్రీల వేడి తక్కువగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక బౌద్ధ సంప్రదాయం ఉట్టిపడేలా ముద్రలు, స్థూపాలు ఏర్పాటు చేస్తున్నారు.

సెంటర్‌ ఏర్పాటు లక్ష్యం..
దళిత స్టడీస్‌ ఏర్పాటు ప్రధాన లక్ష్యం చిరకాలంగా దళితులు, ఆదివాసీలు ఇతర వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సమస్యలను గుర్తించడం, వాటికి సమర్థవంతమైన పరిష్కారాలపై పరిశోధన చేయడం, ప్రభుత్వానికి సిఫారస్‌ చేయడం ద్వారా పాలసీస్థాయిలో పటిష్ట కృషి చేయడం, వివిధ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లపై, సామాజిక సమస్యల పరిష్కారంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం. 

మొత్తం తొమ్మిది అంతస్తులు..
మొదటి అంతస్తులో డైనింగ్, కాఫీషాప్‌ ఏర్పాటు. రెండో అంతస్తులో ధ్యానగది, బోర్డ్‌రూమ్, సమావేశ మందిరం, మూడవ అంతస్తులో లైబ్రరీ, డిజిటల్‌ ల్యాబ్, మీడియా గది, నాల్గో అంతస్తులో శిక్షణకు వచ్చేవారికి వసతి గదులు, ఐదో అంతస్తులో ఆడిటోరియం, ఆరో అంతస్తులో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. దళితులతో సహా ఆర్థికంగా వెనుకబడిన వారి సమస్యలపై పరిశోధన కేంద్రం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్,  విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. భవనం పైకప్పుపై బౌద్ధమత శైలిలో డోమ్‌తో కూడిన విశాల ధ్యాన కేంద్రం నిర్మిస్తున్నారు. 

ప్రత్యేక ఆకర్షణగా అంబేడ్కర్‌ విగ్రహం..
భవనం ముందు భాగంలో మూడవ అంతస్తుపై 25అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి ఫైబర్‌తో నాగ్‌పూర్‌లో విగ్రహం తయారు చేయించి తీసుకువచ్చారు. ఇది దేశంలోనే ఎత్తయిన విగ్రహంగా చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top