సీసీఎస్‌ ‘చేతికి’ సీసీటీఎన్‌ఎస్‌!

CCTNS Going to CCS Hands in Hyderabad - Sakshi

పోలీసుస్టేషన్లలో అమలు విధానాల పర్యవేక్షణకే

బాధ్యతలు అప్పగించిన నగర పోలీసు కమిషనర్‌

ఇన్‌చార్జ్‌లుగా ఏసీపీ టు ఎస్సై స్థాయి అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పోలీసు విభాగాలు–ఏజెన్సీల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి, నేరాల నిరోధం, కేసులను కొలిక్కి తీసుకురావడం లక్ష్యంగా దేశ వ్యాప్తంగా అమలులోకి వస్తున్న వ్యవస్థే క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌ (సీసీటీఎన్‌ఎస్‌). దేశంలోని ఇతర నగరాల కంటే తెలంగాణలో, రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల కంటే హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ఇది వేగంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే దీనిని త్వరితగతిన పూర్తి చేయడానికి పర్యవేక్షణ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ నగర పోలీస్‌ కమిసనర్‌ అంజనీకుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ బాధ్యతలను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులకు అప్పగించారు. ఇటీవల సీసీఎస్‌ సందర్శనకు వచ్చిన ఆయన ఈ విషయం ప్రకటించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి నిత్యం అనేక మంది సిటీకి వచ్చిపోతుండటం, స్థిరపడటం జరుగుతోంది. ఇలాంటి వారిలో కొందరు నేరచరితులై ఉండి, ఇక్కడా అలాంటి వ్యవహారాలే నెరపుతారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పాత నేరగాళ్ల జాబితా మొత్తం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. వీరితో పాటు గతంలో ఇక్కడ నేరం చేసినా బయటి రాష్ట్రాల వారి వివరాలు సైతం రికార్డుల్లో ఉంటాయి. అయితే కేవలం ఆయా రాష్ట్రాల్లో మాత్రమే నేర చరిత్ర ఉండి, తొలిసారిగా ఇక్కడ నేరం చేసిన వివరాలు మాత్రం అందుబాటులో ఉండట్లేదు. ఈ రికార్డులన్నీ ఆయా రాష్ట్రాలకే పరిమితం కావడంతో ఈ సమస్య ఎదురవుతోంది. సీసీటీఎన్‌ఎస్‌ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు.

దేశంలోని అన్ని పోలీసు విభాగాలు, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన రికార్డులు, వివరాలన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తాయి. ఫలితంగా ఓ వ్యక్తి దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో అరెస్టయినా, ఎవరికి వాంటెడ్‌గా ఉన్నా క్షణాల్లో తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఓ అనుమానితుడు, ఘటనాస్థలిలో దొరికిన వేలిముద్ర, ఇతర ఆధారాలను సెర్చ్‌ చేయడం ద్వారా వారి వివరాలు, చిరునామా సహా పూర్తి సమాచారం పొందవచ్చు. అయితే సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అన్ని పోలీసుస్టేషన్లతో పాటు ఏజెన్సీలు రికార్డులను ఆన్‌లైన్‌ చేయాలి. అరెస్టు చేసిన నిందితుల వివరాలు, జారీ అయిన నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు తదితరాలు మాత్రమే కాదు... చివరకు నిందితులు వెల్లడించిన నేరాంగీకార వాంగ్మూలాలు, పోలీసుల దర్యాప్తు సంబంధించిన రికార్డులు సైతం ఆన్‌లైన్‌ కావాలి. దీనికోసం నగర పోలీసు విభాగం గడచిన కొన్నేళ్లుగా ప్రణాళిక బద్ధంగా ముందుకుసాగుతోంది. ఇప్పుడు అరెస్టు చేసిన వారి వివరాలు, దర్యాప్తు చేస్తున్న కేసుల అంశాలతో పాటు పాత వాటినీ అప్‌డేట్‌ చేసుకుంటూ వస్తున్నారు. ఆయా ఠాణాలు, విభాగాలకు చెందిన ఈ–కాప్స్‌ సిబ్బంది ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. నగరానికి సంబంధించి దీని అమలు విధానాన్ని పర్యవేక్షించే బాధ్యతలను నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ సీసీఎస్‌కు అప్పగించారు. ఈ విభాగంలో ఉన్న ఏసీపీ నుంచి ఎస్సై స్థాయి అధికారుల వరకు కొందరిని ఎంపిక చేసి ఒక్కొక్కరిని ఒక్కో ఠాణాకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. వీరు తరచూ ఆయా ఠాణాలకు వెళ్లడంతో పాటు ప్రతి నిత్యం సీసీటీఎన్‌ఎస్‌ అమలు తీరును పర్యవేక్షిస్తుండాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.  

ఆ రెండింటి సమన్వయానికి...
సాంకేతికంగా రాజధానిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ.. ఇలా మూడు కమిషనరేట్లు ఉన్నాయి. అయితే భౌగోళికంగా మాత్రం ఇవి కలిసే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఒక ప్రాంతంలో నేరం చేసిన వారు మరో చోట దాక్కోవడం, ఓ కమిషనరేట్‌కు చెందిన ముఠాలు మరో చోట పంజా విసరడం జరుగుతోంది. సీసీటీఎన్‌ఎస్‌ ప్రాజెక్టు అమలులోకి వచ్చే లోగా భారీ నేరాలు జరిగినప్పడు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో సమన్వయం కోసం పోలీసు ఉన్నతాధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం సీసీఎస్‌ ఆధీనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కీలకమైన కేసులు, భారీ నేరాల విషయంలో సైబరాబాద్‌ అధికారులతో సమన్వయం చేసుకునే బాధ్యతలను సీసీఎస్‌ స్పెషల్‌ టీమ్‌–1కు, రాచకొండతో కో–ఆర్డినేషన్‌ బాధ్యతను సీసీఎస్‌ స్పెషల్‌ టీమ్‌–2కు అప్పగించారు. నగర నేర పరిశోధన విభాగం ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రెండు కమిషనరేట్లలో ఉన్న సైబర్‌ క్రైమ్‌ ఠాణాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేయనున్నారు. ఈ చర్యలు కేసులను త్వరగా కొలిక్కి తీసుకురావడంతో పాటు నేరాల నిరోధానికి ఉపకరిస్తాయని అధికారులు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top