
సీబీఐ వలలో సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
సీబీఐ వలలో మరో అవినీతి తిమింగళం పట్టుబడింది. సెంట్రల్ ఎక్సైజ్ (యాంటీ ఎవేషన్) సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎస్ గోపాలకృష్ణమూర్తి హైదరాబాద్, కాటేదాన్ లోని కేఎం ప్లాస్టిక్ కంపెనీకి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు యజమాని జగదీష్ ప్రసాద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
హైదరాబాద్: సీబీఐ వలలో మరో అవినీతి తిమింగళం పట్టుబడింది. సెంట్రల్ ఎక్సైజ్ (యాంటీ ఎవేషన్) సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎస్ గోపాలకృష్ణమూర్తి హైదరాబాద్, కాటేదాన్ లోని కేఎం ప్లాస్టిక్ కంపెనీకి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు యజమాని జగదీష్ ప్రసాద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీన గోపాలకృష్ణమూర్తి బృందం కంపెనీలో తనిఖీలు చేసింది. అనుకున్నట్టుగానే అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు మంగళవారం ఉదయం రూ.6 లక్షలు జగదీష్ ప్రసాద్ సూపరింటెండెంట్ గోపాలకృష్ణమూర్తికి ఇచ్చాడు. మిగతా 4 లక్షలు మధ్యాహ్నం ఇవ్వాల్సి ఉంది.
ఈ అవినీతి తిమింగళం విషయం సీబీఐకి ఫోన్ ద్వారా తెలిసింది. సంబంధిత అజ్ఞాత వ్యక్తి నుంచి సమాచారం తీసుకున్న సీబీఐ ఇన్ స్పెక్టర్ రాందాస్ బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకొని మిగతా రూ.4 లక్షలు ఇస్తున్న సమయంలో సూపరింటెండెంట్ గోపాలకృష్ణ మూర్తితోపాటు ప్లాస్టిక్ కంపెనీ యజమాని జగదీష్ ప్రసాద్‌ను కూడా అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐబీ డీఐజీ బుధవారం విడుదల పత్రికా ప్రకటనలో తెలిపారు.
గోపాలకృష్ణమూర్తి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన సీబీఐ అధికారులు రూ.5.6లక్షల నగదుతో పాటు కీలకమైన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జీ ముందు ప్రవేశపెట్టినట్టు డీఐజీ తెలిపారు.