
కాళేశ్వరంపై కమిషన్ నివేదికను సీబీఐకి రిఫర్ చేయొద్దు
ఎన్‌డీఎస్‌ఏ, ఇతర రిపోర్టుల ఆధారంగా దర్యాప్తు జరపవచ్చు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీశ్‌కు ఊరట
ఐఏలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలన్న ధర్మాసనం
విచారణ అక్టోబర్ 7కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదిక ఆధారంగా పిటిషనర్ల (కేసీఆర్, హరీశ్‌రావు)పై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఘోష్ నివేదికను సీబీఐకి రిఫర్ చేయవద్దని స్పష్టం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ), ఇతర నివేదికలపై సీబీఐ ఆధారపడవచ్చని తెలిపింది.
ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్లు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)లపై ప్రభుత్వ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనను ధర్మాసనం నమోదు చేసుకుంది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా.. చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఐఏలు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.
సీబీఐకి ఇవ్వాలన్నది సర్కార్ నిర్ణయమే..
ప్రభుత్వం తరఫున ఏజీ, సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు ఉండదు. నివేదికపై చర్యల్లో భాగంగా సీబీఐ దర్యాప్తు కోరలేదు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై సీబీఐ విచారణ చేస్తుంది. జస్టిస్ ఘోష్ నివేదిక అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టాం.. చర్చ కూడా జరిగింది. దీని ఆధారంగా పిటిషనర్లపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సీబీఐకి ఇవ్వాలని కూడా కమిషన్ నివేదికలో లేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం.
సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోవడం లేదు. పిటిషనర్లు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. సీబీఐ విచారణ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపైనే సాగుతుంది.. పిటిషనర్లపై కాదు. మేడిగడ్డ బరాజ్ ఐదు పిల్లర్లు కూలిపోవడానికి ఎవరు బాధ్యులో తేలుస్తుంది. కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయనే భయంతో వేసిన ఐఏలు విచారణార్హం కాదు. కొట్టివేయండి..’అని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తునకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కాపీని ధర్మాసనానికి అందజేశారు.
నోటిఫికేషన్‌లో ఎందుకు పేర్కొనలేదు...
కేసీఆర్, హరీశ్ తరఫున సీనియర్ న్యాయవాదులు దామ శేషాద్రినాయుడు, ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు. ‘కమిషన్ నివేదికలో ఎవరు తప్పు చేశారో ఉందని, ఎవరినీ వదిలిపెట్టబోమని ప్రభుత్వం చెప్పిందని, అసెంబ్లీలోనూ ముఖ్యమంత్రి చెప్పారని ఏజీ సోమవారం చెప్పారు. ఇప్పుడేమో నివేదికపై చర్యలు ఉండవని చెబుతున్నారు. నివేదికతో పని లేనప్పుడు సీబీఐ దర్యాప్తు కోరిన నోటిఫికేషన్‌లో అలా ఎందుకు పేర్కొనలేదు? ప్రభుత్వం ఇచ్చిన హామీని రికార్డుల్లో నమోదు చేయాలి.
ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి..’అని కోరారు. సీజే జోక్యం చేసుకుని.. ‘కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టారా? చర్యలు తీసుకుంటారా?’అని ఏజీని ప్రశ్నించింది. అసెంబ్లీలో పెట్టి చర్చించారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏజీ బదులిచ్చారు. అయితే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోమని చెబుతూనే అందులోకి విషయాలను ప్రస్తావిస్తూ సీబీఐ దర్యాప్తు కోరారని శేషాద్రినాయుడు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ హామీని నమోదు చేసుకుంది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సర్కార్‌ను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
జస్టిస్ ఘోష్ నివేదిక రద్దు చేయండి: మాజీ సీఎస్ జోషి
జస్టిస్ ఘోష్ నివేదిక రద్దు చేయాలని కోరుతూ నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి (రిటైర్డ్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కమిషన్ సాక్షిగా మాత్రమే సమన్లు జారీ చేసిందని.. చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది.