రంగస్థలం రెడీ..!

Candidates Ready To Face Election Fight - Sakshi

ముగిసిన నామినేషన్ల దాఖలు గడువు 

అన్ని నియోజకవర్గాల్లోనూ బహుముఖ పోరు 

హేమాహేమీల రంగ ప్రవేశంతో ఉత్కంఠ పోరు 

పలు స్థానాల్లో   వేధిస్తున్న రెబెల్స్‌ బెడద 

ఆసక్తికరంగా మారిన పాలమూరు ఎన్నికల పోరు 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల రణరంగం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారం ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు సైతం ఎన్నికల పోరులో తలపడుతున్నారు.

ఇలా దాదాపు అన్ని చోట్ల కూడా రెబెల్స్‌ బెడద తప్పేలా లేదు. అలాగే మహాకూటమి పొత్తులో భాగంగా కేటాయించిన  స్థానాల్లో సైతం స్నేహపూర్వక పోటీతో బరిలో నిలుస్తుండడంతో ఆసక్తి నెలకొంది. అంతేకాక ఎన్నికల పోరులో హేమాహేమీలు, దాదాపు అన్ని పార్టీల నుంచి అందరూ పాత కాపులే బరిలోకి దిగడంతో పోరు ప్రతిష్టాత్మకంగా మారింది.

మొత్తం మీద ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయనే చెప్పాలి. అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

రెబెల్స్‌తో ఉక్కిరిబిక్కిరి 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులను రెబెల్స్‌ బెడద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చాలాచోట్ల టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు సైతం బరిలోకి దిగారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ రెబెల్‌గా మక్తల్‌ నియోజకవర్గం నుంచి ఎం.జలందర్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఒక్క స్థానం మినహా ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు పెద్దగా రెబెల్స్‌ బెడద లేదు. అయితే మహాకూటమి నుంచి మాత్రం చాలా చోట్ల రెబెల్స్‌ బెడద పట్టి పీడిస్తోంది.

ఒక్క మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉంది.కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ ఆశించి భంగపడిన టీపీసీసీ కార్యదర్శలు మారేపల్లి సురేందర్‌రెడ్డి ఎన్సీపీ నుంచి సయ్యద్‌ ఇబ్రహీం బీఎస్పీ నుంచి నామినేషన్లు వేశారు. అలాగే తెలంగాణ ఇంటి పార్టీనేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. వీరితో పాటు మహాకూటమిలో భాగస్వామ్యమైన తెలంగాణ జన సమితి నుంచి జి.రాజేందర్‌రెడ్డి పార్టీ బీ–ఫాంతో మరోసారి నామినేషన్‌ దాఖలు చేశారు.

అదే విధంగా నారాయణపేటలో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన కుంభం శివకుమార్‌రెడ్డి... రూటు మార్చి బీఎల్‌ఎఫ్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. దేవరకద్రలో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన న్యాయవాది జి.మధుసూదర్‌రెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఇలా మొత్తం మీద రెబెల్స్‌ అభ్యర్థులు ప్రధాన పోటీదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.  

- మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యనేతలందరూ బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, మహాకూటమి తరఫున మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎర్రశేఖర్, టీజేఎస్‌ నుంచి జి.రాజేందర్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు టిక్కెట్‌ ఆశించి భంగపడిన వారిలో టీపీసీసీ కార్యదర్శులు మారేపల్లి సురేందర్‌రెడ్డి, సయ్యద్‌ ఇబ్రహీం సైతం పోరులో నిలుస్తున్నారు.

సురేందర్‌రెడ్డి ఎన్‌సీపీ నుంచి, పలుమార్లు పోటీ చేసి ఓటమి పాలవుతున్న సయ్యద్‌ ఇబ్రహీం బీఎస్‌పీ బీ–ఫాం తెచ్చుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. వీరితో పాటు బీజేపీ తరఫున జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి కూడా పోటీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలా అందరూ హేమాహేమీలు బరిలో నిలవడంతో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది.  

- జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డితో పాటు కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే మల్లు రవి మధ్య పోరు ఉండే అవకాశం ఉంది. వీరితో పాటు బీజేపీ తరఫున మధుసూదన్‌యాదవ్‌ తదితరులతో పాటు స్వతంత్రులు బరిలో ఉన్నారు. అయితే, ఇక్కడ రెబెల్స్‌ బెడద లేకపోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డికి సౌమ్యుడిగా మంచి పేరు ఉండటంతో విపక్ష పార్టీల అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

- దేవరకద్ర నియోజకవర్గంలో పోరు కాస్త హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. అయితే మహాకూటమి నుంచి కాంగ్రెస్‌ నేత డోకూరు పవన్‌కుమార్‌కు టిక్కెట్‌ కేటాయించింది.

గత ఎన్నికల్లో కూడా ఇద్దరు తలపడటం... ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో కేడర్‌కు అందుబాటులో ఉండటంతో పవన్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ ఆశించి భంగపడిన హైకోర్టు న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. దీంతో దేవరకద్రలో సైతం పోరు ఆసక్తికరంగా మారింది.  

- మక్తల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు రెబెల్‌ నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బరిలో ఉన్నారు. అయితే చిట్టెం అభ్యర్థిత్వంపై తిరుగుబాటు చేసిన టీఆర్‌ఎస్‌ నేతలు... రెబెల్‌గా ఎం.జలందర్‌రెడ్డిని బరిలో నిలిపారు. అలాగే మహాకూటమి తరఫున టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి టికెట్‌ దక్కించుకున్నారు. బీజేపీ తరఫున కూడా బలమైన నేత కొండయ్య బరిలో ఉన్నారు. ఇలా మొత్తం మీద మక్తల్‌ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది.  

- నారాయణపేట నియోజవర్గంలో ఎన్నికల పోరు కొత్త రూపం సంతరించుకుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశించి భంగపడిన కుంభం శివకుమార్‌రెడ్డి బీఎల్‌ఎఫ్‌ పార్టీ తరఫున బరిలోకి దిగారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ తరఫున మరోసారి బరిలో నిలిచారు. వీరితో పాటు కాంగ్రెస్‌ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన సరాఫ్‌ కృష్ణ సైతం నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే నియోజకవర్గంలో కాస్త బలంగా ఉన్న బీజేపీ తరఫున కె.రతంగ్‌పాండు రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇలా మొత్తం మీద పేట నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొన్నట్లయింది.  

- రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కొడంగల్‌ పోరు సైతం ఉత్కంఠ భరితంగా మారింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎనుముల రేవంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తంగా మారింది. ఇరువురు నేతలు నిత్యం బలప్రదర్శనతో యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది. అలాగే బీజేపీ తరఫున సీనియర్‌నేత నాగూరావ్‌ నామాజీ పోటీ చేస్తున్నారు.  

- నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉద్దండులు తలపడుతున్నారు. ఇక్కడి నుంచి ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య పోటీ ఉండనుంది. టీఆర్‌ఎస్‌ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి బరిలో నిలిచారు. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నుంచి అత్యంత సీనియర్‌నేత నాగం జనార్దన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.

ఇద్దరు కూడా బలమైన నేతలు కావడంతో పోరు రసవత్తరంగా మారింది. అలాగే బీజేపీ తరఫున దిలీప్‌ ఆచారి కూడా కాస్త ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.  

- కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఈసారి పోరు రణరంగాన్ని తలపిస్తోంది. ఇక్కడి నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన జూపల్లి కృష్ణారావుకు ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రతీసారి జూపల్లికి తన ఎన్నికల ప్రత్యర్థి మారుతుండటంతో సులువుగా గెలుపొందే వారు.

కానీ ఈసారి మాత్రం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన వ్యక్తే.. మళ్లీ బరిలోకి దిగడంతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బీజేపీ తరఫున ఎల్లేటి సుధాకర్‌రావు కూడా కాస్త ప్రభావం చూపుతారని తెలుస్తోంది. 

- అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు మరోసారి బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున మల్లేశ్వర్‌ ఇలా ఇతర పక్షాల నేతలు బరిలో నిలిచినప్పటికీ పోరు మాత్రం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్యే ఉండనుంది. ఇక్కడి నుంచి గెలుపొందే అభ్యర్థి పార్టీయే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటుందనే సెంటిమెంట్‌ ఉండటంతో ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.  

- రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న కల్వకుర్తి నియోజకవర్గ పోరు కూడా త్రిముఖంగా మారింది. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ అభ్యర్థి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి టి.ఆచారి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కృషిచేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, కాంగ్రెస్‌ తరఫున చల్లా వంశీచంద్‌రెడ్డి బరిలో ఉన్నారు. 

- వనపర్తి నియోజకవర్గం నుంచి ఈసారి ఉద్దండులు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండగా.. ఈసారి మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ ఉండనుంది. టీఆర్‌ఎస్‌ తరఫున రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి మధ్య గట్టి పోటీ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈసారి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి... కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు తెలపడంతో పోరు ఆసక్తికరంగా మారింది.  

- అలంపూర్‌ నియోజకవర్గంలో కూడా రెండు పార్టీల మధ్య పోరు నువ్వా – నేనా అన్నట్లుగా మారింది. కాంగ్రెస్‌ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే అబ్రహం పోటీలో ఉన్నారు. ఇరువురు కూడా గట్టిగా తలపడుతుండడంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది.

 
- రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గాలలో గద్వాల ఒకటి. ఇక్క డి నుంచి మాజీ మంత్రి డీకే.అరుణ కాంగ్రెస్‌ తర ఫునే పోటీలో ఉండటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఇప్పటికే మూడు సార్లు వరుసగా విజయం సాధిస్తున్న డీకే అరుణ... మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అలాగే వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి తలపడేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇలా మొత్తం మీద గద్వాల్‌ నియోజకవర్గం పోరు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top