కేబుల్‌ స్పీడ్‌

Cable Stay Bridge Works Speedup in Durgam Cheruvu - Sakshi

వడివడిగా దుర్గం చెరువు బ్రిడ్జి పనులు  

ప్రీకాస్ట్‌ సెగ్మెంట్‌ అలైన్‌మెంట్‌ సక్సెస్‌

ప్రపంచంలోనే పొడవైన కేబుల్‌ స్టే బ్రిడ్జి ఇది..

సాక్షి, సిటీబ్యూరో: దుర్గం చెరువుఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ స్టే బ్రిడ్జి పనులుశరవేగంగా జరుగుతున్నాయి. దసరా వరకు పనులు పూర్తి చేయాలని భావిస్తున్న జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. రెండు పిల్లర్ల మధ్య వేసే మెయిన్‌ బ్రిడ్జిలో ప్రీకాస్ట్‌ సెగ్మెంట్‌ అలైన్‌మెంట్‌ ప్రక్రియను గురువారం విజయవంతంగా పూర్తి చేశారు. 160 మెట్రిక్‌ టన్నుల బరువున్న ఈ భారీ సెగ్మెంట్‌ దేశంలోనే పెద్దది. ఇప్పటివరకు ఇంత బరువైన సెగ్మెంట్‌ను ఎక్కడా వినియోగించలేదు. ఇనార్బిట్‌మాల్‌ సమీపంలోనిప్రీకాస్టింగ్‌ యార్డులో తయారైన ఈ ప్రీకాస్ట్‌ సెగ్మెంట్‌ను తొలుత దుర్గం చెరువు వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత పంటూన్‌ ద్వారా చెరువులోకి తీసుకెళ్లి పైకి లిఫ్ట్‌ చేశారు. ఈ బ్రిడ్జిని మొత్తం 52 సెగ్మెంట్లతో నిర్మించనుండగా... దేశీయ సాంకేతికతతోనే ఇంతటి భారీ సెగ్మెంట్‌ను విజయవంతంగా పైకి తీసుకెళ్లారు.

చెరువుపై ఉండే బ్రిడ్జి స్పాన్‌ 234 మీటర్లు కాగా... ఇది దేశంలోనే అతి పొడవైనది. జపాన్‌లో ఇంతకంటే పొడవైన స్పాన్లతో కేబుల్‌ బ్రిడ్జీలు ఉన్నప్పటికీ.. వాటిల్లో స్టీల్‌ వినియోగించారని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌.శ్రీధర్‌ తెలిపారు. స్టీల్‌ లేకుండా ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ స్టే ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌ బ్రిడ్జిలో మాత్రం ప్రపంచంలోనే ఇది పొడవైనదని పేర్కొన్నారు. ఇంత పొడవైన స్పాన్‌ ఇప్పటి వరకు ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఇక మన దేశానికి వస్తే గుజరాత్‌ బరూచ్‌ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్‌ బ్రిడ్జే పెద్దదని చెప్పారు. మెయిన్‌ స్పాన్‌తో పాటు రెండువైపులా బ్యాక్‌ స్పాన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే పొడవు 426 మీటర్లు అవుతుందన్నారు. దీని అంచనా వ్యయం రూ.184 కోట్లు కాగా... నిర్మాణం పూర్తయితే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఐకియా స్టోర్‌ వరకు సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం సాధ్యమవుతుందన్నారు. మొదటి సెగ్మెంట్‌ అమరిక పనులు మొత్తం ఐదారు రోజుల్లో పూర్తవుతాయని జీహెచ్‌ఎంసీ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ వెంకటరమణ తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులకో సెగ్మెంట్‌ చొప్పున పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 

60 శాతం పూర్తి...  
దుర్గం చెరువుపై 20 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ కేబుల్‌ బ్రిడ్జి పనులు 65 శాతం పూర్తయ్యాయి. ఎక్స్‌ట్రా డోస్డ్‌ సాంకేతికత వినియోగిస్తున్నందున చెరువు మధ్యలో పిల్లర్‌ అవసరం లేకపోవడంతో పాటు వంతెనను 75 మీటర్లకు బదులు 57 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ హ్యాంగింగ్‌ బ్రిడ్జిగానూ ఇది గుర్తింపు పొందనుంది. బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాక జూబ్లీహిల్స్‌ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు 2కి.మీ మేర దూరం తగ్గడంతో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36, మాదాపూర్‌లపై ట్రాఫిక్‌ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. దసరా నాటికి ఈ కేబుల్‌ స్టే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. దీంతో పాటు రూ.333.55 కోట్ల వ్యయంతో చేపట్టిన షేక్‌పేట్‌ ఎలివేటెడ్‌ కారిడార్, రూ.263 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్తగూడ గ్రేడ్‌ సెపరేటర్, ఒవైసీ హాస్పిటల్‌ నుంచి బహదూర్‌పురా మార్గంలో రూ.132 కోట్ల వ్యయంతో కారిడార్, అంబర్‌పేట ఛే నంబర్‌ వద్ద రూ.270 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లైఓవర్లు కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top