మారండయా..! | Bribery continuing by government employes | Sakshi
Sakshi News home page

మారండయా..!

Aug 20 2015 3:53 AM | Updated on Apr 4 2019 5:41 PM

మారండయా..! - Sakshi

మారండయా..!

ప్రభుత్వ ఉద్యోగులకు సరిపడా వేతనాలు ఇస్తేనే మరింత పారదర్శకంగా.. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తారని భావించిన సీఎం ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు...

ఊహించని లేని స్థాయిలో వేతనాలు.. విధుల నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా అన్నీ సౌకర్యాలు.. బాధ్యతల నిర్వర్తింపులో స్వేచ్ఛ.. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడిలేని వరాలు కురిపిస్తోంది. ఇలా ఎన్ని వరాలు.. వసతులు కల్పించినా జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగుల బుద్ధి మారడం లేదు. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపైనా వేటుపడింది. అయినా.. జిల్లాలో అవినీతి అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ప్రజల కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలన్న సీఎం ఆశయానికి స్వయంగా ప్రభుత్వ ఉద్యోగులు తూట్లు పొడుస్తున్న సంఘటనలు జిల్లాలో వెలుగులోకి వస్తున్నాయి. - సాక్షి, మంచిర్యాల
 
జీతాలు రెట్టింపైనా బుద్ధిమార్చుకోని ఉద్యోగులు
- చేతులు తడిపితేనే పని
- క్షేత్రస్థాయిలో పెచ్చుమీరుతున్న అవినీతి
- మార్చి నెలాఖరు నుంచి ఏసీబీకి చిక్కిన వారి సంఖ్య పది
- సామాన్యులకు తప్పని ఇబ్బందులు
సాక్షి, మంచిర్యాల :
ప్రభుత్వ ఉద్యోగులకు సరిపడా వేతనాలు ఇస్తేనే మరింత పారదర్శకంగా.. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తారని భావించిన సీఎం ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. దీంతో ఉద్యోగుల వేతనాలు రూ.3 వేల నుంచి రూ.16 వేల వరకు పెరిగాయి. జీతాలు భారీగా పెరిగినా జిల్లాలో పలు శాఖల్లో లంచాలకు అలవాటు పడ్డ కొందరు ఉద్యోగులు మాత్రం చేయి తడపందే పనిచేయడం లేదు. లంచమిచ్చినా పని సకాలంలో అవుతుందంటే అదీ లేదు.

చివరకు విసిగివేసారి బాధితులు ఏసీబీకి ఆశ్రయించక తప్పని పరిస్థితులు వచ్చాయి. అధికారులు, సిబ్బందిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా.. అవినీతి ఉద్యోగుల తీరులో మార్పు రావడం లేదు. కనీసం వారిలో ఒకింత భయం కూడా కనిపించడం లేదు. గడిచిన ఐదు నెలల్లో జిల్లాలో పది మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం ఉదయం మంచిర్యాలకు ఆనుకుని ఉన్న లక్షెట్టిపేటలో ఆస్పత్రి వైద్యుడు లకావత్ రవీందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు సాయంత్రం మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐలో పనిచేస్తున్న లింగమూర్తిని లంచం తీసుకుంటూ పట్టుకోవడం చర్చనీయాంశమైంది.
 
పని కావాలంటే.. ఇచ్చుకోవాల్సిందే..!
జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కలిపి 73 వరకు ఉన్నాయి. వీటి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సుమారు 50 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. లక్షలాది మంది జిల్లా ప్రజలు ఈ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నారు. అయితే.. వీటిలో పలు శాఖలు అమలు చేస్తున్న పథకాల లబ్ధిపొందాలంటే సిబ్బందిని ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి. చేతులు త డిపితేనే తప్ప కార్యాలయంలో ఫైలులో కదలిక రాదు. ఒకవేళ చెప్పినంత ఇచ్చుకోకపోతే త క్కువ సమయంలో జరగాల్సిన పనికి నెలలు పడుతుంది. అదీ సంబంధిత శాఖ కార్యాలయాలు.. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తేనే వారి ఆదేశాల మేరకు పూర్తవుతుంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా జిల్లాలో పలువురు అవినీతి ఉద్యోగులు జాగ్రత్త పడుతున్నారు. ఏసీబీకి పట్టుబడ్డప్పుడే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
 
అక్రమాస్తులపై ఏసీబీ ఆరా..

ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులూ అక్రమార్కుల ఆస్తులపై దృష్టిసారించారు. పలు శాఖల్లో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులు సైతం కోట్లాది రూపాయలకు పడగలెత్తారు. దీంతో వీరి ఆస్తులు, వాటి వివరాలు రాబట్టే దిశగా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా అవినీతికి మారుపేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిసింది. స్థిరాస్తి వ్యాపారం అత్యధికంగా జరుగుతున్న తూర్పు ప్రాంతంలో రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.  భూములకు సంబంధించిన రికార్డుల నిర్వహణ విషయంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement