బీజేపీ నేత కిషన్‌రెడ్డికి మాతృవియోగం 

BJP leader Kishan Reddy mother passes away - Sakshi

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మాతృమూర్తి గంగాపురం ఆండాలమ్మ(80) గురువారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఈ నెల 23న ఇక్కడి హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి మృతితో బర్కత్‌పురలోని కిషన్‌రెడ్డి ఇంటివద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా కిషన్‌రెడ్డి అందరి కంటే చిన్నవాడు. ఆండాలమ్మ పార్థివదేహాన్ని స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయతోపాటు వివిధ పార్టీల నేతలు, ప్రజా, కుల సంఘాల నేతలు కిషన్‌రెడ్డిని కలసి ఓదార్చారు.  

కిషన్‌రెడ్డికి సానుభూతి తెలిపిన రాష్ట్రపతి 
కిషన్‌రెడ్డి తల్లి ఆండాలమ్మ మరణించిన విషయం తెలియడంతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పలువురు కేంద్ర, రాష్ట్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు కిషన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఏపీ, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, ఫడ్నవిస్, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, బీజేపీ తెలంగాణ, ఏపీ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్, కన్నా లక్ష్మీనారాయణ, నాయకులు మురళీధర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ ప్రభాకర్, ఎన్‌.రాంచందర్‌రావు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, జస్టిస్‌ నరసింహారెడ్డి, ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణ మాదిగ తదితరులు కిషన్‌రెడ్డికి సానుభూతి తెలిపినవారిలోఉన్నారు. పలువురు నేతలు ఆండాలమ్మ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.  

సీఎం కేసీఆర్‌ సంతాపం 
కిషన్‌రెడ్డి తల్లి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top