ఫ్యాక్టరీని విక్రయిస్తే తరిమికొడతాం 

BJP ex MLA Yendala Laxmi Narayana Fires on KCR About Bodhan Sugar Factory - Sakshi

మాజీ ఎమ్మెల్యే యెండల 

రెంజల్‌(బోధన్‌): బోధన్‌లోని చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం విక్రయిస్తే తరమికొడతామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రైతులు, కార్మికులతో ప్రతిఘటిస్తామన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా రెంజల్‌ మండలం నీలాక్యాంపులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం కేసీఆర్‌ మాట మార్చారని విమర్శించారు. ‘కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు’ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరు ఉందన్నారు. కార్మికుల బకాయిలను చెల్లించి వందలాది మందికి ఉపాధినిస్తున్న ఫ్యాక్టరీని తెరిపించాలన్నారు. రూ.360 కోట్లు చెల్లించిన కేసీఆర్‌ రూ.500 కోట్లతో అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టడం సిగ్గుచేటన్నారు. జిల్లా కేంద్రంలోని నడిబోడ్డున ఉన్న కలెక్టరేట్‌ను తరలించడంలో అనుమానం వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయానికి ఎంపిక చేసిన భూమి విలువ మార్కెట్‌లో రూ.1.50 లక్షలకు గజం ఉండగా కేవలం రూ.వందకు గజం చొప్పున ధర కట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని దేశం సరిహద్దు, అంతర్గత భద్రత విభాగాల్లో సురక్షితంగా ఉందన్నారు. పాకిస్తాన్‌ ప్రేరేపిత కాశ్మీర్‌లో ఉగ్రవాద, తీవ్రవాదం పూర్తిగా తగ్గిందన్నారు. మానవబాంబులను మోదీ నిర్వీర్యం చేశారని ఫలితంగా ప్రపంచ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలకు గౌరవం లభిస్తుందన్నారు. 

సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది.. 

సొమ్ము కేంద్రానిదైతే రాష్ట్ర ప్రభుత్వం సోకు చేస్తుందని యెండల ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు 2014–15లో ఒక్కొక్కరికి రూ.350 ఉండగా 2018–19కు రూ. 804కు కేంద్రం పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూపాయి కూడా విదల్చడంలేదన్నారు. ఉపాధిహామీ మొదటి విడతలో ఇచ్చిన హామీలు నెరవేరకుండారనే రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎంపీపీ లోలపు రజిని, జెడ్పీటీసీ మేక విజయ, ఎంపీటీసీలు యోగేశ్, గడ్డం స్వప్న, జల్ల రుక్మిణి, అంతయ్య, బీజేపీ నాయకులు సంతోష్, కిషోర్, కోయా సాంబశివరావ్, డాక్టర్‌ శివప్ప, సుభాష్, భాస్కర్‌రెడ్డి, రాజు, వెంకటేశ్వర్‌రావ్, రాంచందర్, పోచయ్య, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top