‘బయో’ బస్సులు భేష్‌

Biodiesel Using In Hyderabad City Buses - Sakshi

ఆర్టీసీలో సత్ఫలితాలిస్తున్న బయో డీజిల్‌ వినియోగం 

ఏటా రూ.3.40 కోట్లు ఆదా రోజుకు 23,569 లీటర్ల 

వినియోగం కాలుష్యకారకాల నియంత్రణకు తోడ్పాటు 

సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ‘బయో’ బస్సులు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం 19 డిపోల్లో బయోడీజిల్‌ను వినియోగిస్తున్నారు. గ్రేటర్‌లోని 29 డిపోల్లో ఉన్న 3572 బస్సులను సైతం ఈ ఇంధనం పరిధిలోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది.  పర్యావరణ ప్రమాణాలను కాపాడడం, కాలుష్య కారకాల నియంత్రణ లక్ష్యంతో ఇప్పటికే సీఎన్‌జీ బస్సులు నడుపుతున్న గ్రేటర్‌ ఆర్టీసీ....ఆ దిశగా బయో ఇంధనానికి శ్రీకారం చుట్టింది. సాధారణ హైస్పీడ్‌ డీజిల్‌కు 10 శాతం చొప్పున బయో డీజిల్‌ను వినియోగిస్తున్నారు. దీనివల్ల ఇంధనం పూర్తిగా మండి కాలుష్యకారకాలు తగ్గుతాయి.

ప్రతి రోజు 250 కిలోమీటర్ల చొప్పున తిరిగే ఒక బస్సు సాధారణంగా 55 లీటర్ల  హైస్పీడ్‌ డీజిల్‌ను వినియోగిస్తుండగా దానికి 10 శాతం చొప్పున బయోడీజిల్‌ను వినియోగిస్తున్నారు. అంటే 49.5 లీటర్ల హైస్పీడ్‌ డీజిల్‌కు 5.5 లీటర్ల బయోడీజిల్‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన నగరంలో ప్రస్తుతం 23,569 లీటర్ల బయోడీజిల్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో  ఇంధనానికి అయ్యే ఖర్చులో   రోజుకు రూ.94,276 చొప్పున ఏటా రూ.3.40 కోట్ల ఇంధన వ్యయం ఆదా అవుతోంది.   

ప్రయోగాత్మకంగా అమలు... 
ప్రజారవాణా వాహనాలకు సహజ ఇంధనాలను వినియోగించాలన్న భూరేలాల్‌ కమిటీ  సిఫార్సుల మేరకు ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణకు దిగింది. మేడ్చల్, హకీంపేట్, కంటోన్మెంట్‌ డిపోలలో సీఎన్‌జీ బస్సులను ప్రవేశపెట్టింది. దశలవారీగా అన్ని డిపోలను సీఎన్‌జీ పరిధిలోకి తేవాలని భావించినప్పటికీ డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో  138 బస్సులకే పరిమితమయ్యారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా బయో ఇంధనంపై దృష్టి సారించారు. అప్పట్లో దిల్‌సుఖ్‌నగర్‌–పటాన్‌చెరు మధ్య కొన్ని ‘బయో’బస్సులను నడిపారు. హైస్పీడ్‌ డీజిల్‌కు 5 శాతం, 10 శాతం, 20 శాతం చొప్పున మూడు కేటగిరీల్లో  బయో ఇంధన వినియోగాన్ని పరీక్షించారు. 20 శాతం వినియోగించిన బస్సుల్లో ఇంజన్‌తో పాటు, కొన్ని విడిభాగాలు పాడైపోయాయి.

అలాగే 5 శాతం వినియోగించిన బస్సుల్లో ఇంధనం పూర్తిస్థాయిలో మండకపోవడం వల్ల సల్ఫర్‌ వంటి హానికారకాలు అలాగే ఉండిì పోయాయి. 10 శాతం బయోడీజిల్‌  వినియోగించిన బస్సుల్లో  ఇంధనం పూర్తిగా మండిపోయి  సల్ఫర్‌ వంటి కాలుష్యకారకాలను  నియంత్రించగలిగినట్లు  ఆర్టీసీ  ఇంజనీరింగ్‌ నిపుణులు అంచనాకు వచ్చారు. పైగా   బయోడీజిల్‌లో ఇమిడి ఉండే 11 శాతం ఆక్సీజన్‌ కాలుష్యకారకాలను పూర్తిగా మండించేందుకు దోహదం చేస్తున్నట్లు గుర్తించారు. అప్పట్లో సదరన్‌ బయో డీజిల్‌ సంస్థతో ధరల విషయంలో ఒక అంగీకారం కుదకరపోవడంతో సరఫరా నిలిచిపోయింది. తిరిగి 2016 నుంచి వినియోగిస్తున్నారు.  బయోడీజిల్‌ వినియోగం వల్ల వాతావరణ కాలుష్యానికి కళ్లెం పడడమే కాకుండా ఆర్టీసీకి డీజిల్‌ ఖర్చు బాగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో బయో డీజిల్‌ వినియోగం చేపట్టాలి.

ఇదీ లెక్క ... 
ఆర్టీసీలో మొత్తం బస్సులు : 35720 
బయోడీజిల్‌ బస్సులు : ప్రస్తుతం 2550  
సీఎన్‌జీ బస్సులు : 138 
ఒక లీటర్‌ హైస్పీడ్‌ డీజిల్‌ పైన దూరం: 4.5 కిలోమీటర్లు 
బయోడీజిల్‌ వల్ల : 4.7 కిలోమీటర్లు 
సీఎన్‌జీ  వల్ల : 5 కిలోమీటర్లు 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో సిటీ బస్సులు  ప్రతి రోజు 10.09  లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. 
ప్రతిరోజు 42,275 ట్రిప్పులలో 
33 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top