కొలువుల్లోనూ వెనుకబాటే | Behind the scenes | Sakshi
Sakshi News home page

కొలువుల్లోనూ వెనుకబాటే

Mar 3 2018 1:18 AM | Updated on Mar 3 2018 1:18 AM

Behind the scenes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో ఓబీసీలు వెనుకబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని గణాంకాలను చూస్తే ఇది స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులుండేవి 69 శాఖలు. వాటిలో దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులుండగా... అందులో 27 శాతం ఉద్యోగులు ఓబీసీ వర్గాలకు చెందినవారుండాలి. కానీ ఈ సంఖ్య 17 శాతానికి మించడం లేదు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం బీసీలకు అమలు చేస్తున్నారు. 1993 నుంచి ఓబీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. కానీ ఈ వర్గానికి చెందిన ఉద్యోగుల సంఖ్య ఎస్సీ ఉద్యోగుల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు నాలుగు కేటగిరీల్లో ఉన్నారు. ఉన్నతస్థాయి పోస్టులు మినహాయిస్తే మిగతా స్థాయిల్లో వీరిని.. గ్రూప్‌ ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించారు. గ్రూప్‌–ఏ కేటగిరీలో ఎస్సీలు 11.5 శాతం ఉండగా.. ఓబీసీలు 6.9 శాతం ఉన్నారు. గ్రూప్‌–బీలో ఎస్సీలు 14.9 శాతం ఉండగా... ఓబీసీలు 7.3 శాతం ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగులు, వారి సామాజిక వర్గాల కోణంలో అధికారికంగా తీసుకున్న సమాచారం ఆధారంగా రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు ఇ.ఆంజనేయగౌడ్‌ ‘సామాజిక న్యాయం, భారతదేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ఓబీసీలు’పేరుతో పుస్తకం ప్రచురించారు. అందులో ఈ గణాంకాలను పేర్కొన్నారు. 

నియామకాల్లో నిబంధనలకు నీళ్లు 
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గందరగోళంగా ఉంది. మండల్‌ కమిషన్‌ ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాల భర్తీ తరహాల్లో ఓబీసీ ఉద్యోగాల భర్తీలో మిగులు పోస్టులను క్యారీఫార్వర్డ్‌ చేయాలి. అలా చేస్తే ఆ పోస్టులు తిరిగి ఆయా వర్గాలకే వస్తా యి. కానీ ఓబీసీల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. యూపీఎస్సీ ద్వారా జరుగుతున్న నియామకాల్లో ఓపెన్‌ కేటగిరీలో ఓబీసీ అభ్యర్థి ఉద్యోగం పొందినా.. ఆ పోస్టును రిజర్వేషన్‌ కోటాలో చూపిస్తున్నారు. దీంతో అభ్యర్థి తీవ్రంగా నష్టపోతున్నాడు. క్రీమీలేయర్‌ విధానంతోనూ ఓబీసీలకు నష్టం జరుగుతోంది. దాదాపు పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. పూర్తిస్థాయి పోస్టులు భర్తీ చేయకుండా సగానికిపైగా ఖాళీగా ఉం చుతున్నారు. ఎక్కువగా ప్రైవేటు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిని పాటిస్తున్నారు. దీంతో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమ లు చేస్తే ఓబీసీలకు సగం వాటా దక్కుతుంది. అలా చేయకపోవడంతో వెనుకబాటుకు గురవుతున్నారు.      
    – ఇ.ఆంజనేయగౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement