ఆగ్రహ జ్వాలలు..

BC Leaders Not Satisfied For Mahakutami Seats Allocation - Sakshi

వరంగల్‌ కాంగ్రెస్‌ నేతల్లో తీవ్ర అసంతృప్తి 

కాంగ్రెస్‌కు రాజీనామా యోచనలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి

ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగే అవకాశం.. ఆయన బాటలో మరికొందరు

సాక్షి, హైదరాబాద్‌ : మహా కూటమిలో టికెట్‌ కేటాయింపులపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు తక్కువ స్థానాలు కేటాయించడంపై ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు మండిపడుతున్నారు. బీసీలకు అన్నింటా అన్యాయం జరుగుతోందని ఆగ్రహోదగ్రులవుతున్నారు. బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేయడంపై నిరసనగా ఈ నెల 17న తెలంగాణ బంద్‌కు బీసీ నేత ఆర్‌ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలకు తగినమొత్తంలో సీట్లు కేటాయించి న్యాయం చేస్తామన్న కాంగ్రెస్‌ పార్టే అన్యాయం చేసిందని ఆర్‌ కృష్ణయ్య మండిపడ్డారు.

కాంగ్రెస్‌లోనూ బీసీ సెగలు!
65మంది అభ్యర్థులతో తాజాగా కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో కేవలం 13మంది బీసీ నేతలకు మాత్రమే టికెట్లు కేటాయించింది. దీంతో ఆ పార్టీలోని బీసీ నేతలు తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సహా చాలామంది బీసీ నేతలకు పార్టీ మొండిచేయి చూపడంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. తనకు టికెట్‌ దక్కకపోవడంతో పొన్నాల హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మహూకూటమి పొత్తుల్లో భాగంగా జనగాం సీటును టీజేఎస్‌కు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆ స్థానాన్ని ప్రస్తుతం పెండింగ్‌లో ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్‌ సాధించాలనే పట్టుదలతో పొన్నాల ఢిల్లీ వెళ్లారని ఆయన అనుచరులు చెప్తున్నారు. శేరిలింగంపల్లి టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. టిక్కెట్‌ రాకపోవడంతో భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఇండింపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని భిక్షపతి యాదవ్‌ భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top