రాష్ట్రానికి బ్యాటరీ యూనిట్‌ | Battery Making Unit In Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి బ్యాటరీ యూనిట్‌

Jun 8 2019 1:48 AM | Updated on Jun 8 2019 6:52 AM

Battery Making Unit In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఐదు గిగావాట్ల సామర్థ్యంగల లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. బ్యాటరీ తయారీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ శుక్రవారం వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. భారీ బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్‌ బ్యాంకు తమ వద్ద ఉందని సీఎస్‌ వెల్లడించారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు ఔటర్‌ రింగురోడ్డుకు అత్యంత సమీపంలో బ్యాటరీ యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన భూమి అందుబాటులో ఉందన్నారు.

బ్యాటరీ యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపుతోపాటు నీరు, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు, నైపుణ్యంగల మానవవనరులు కూడా అందుబాటులో ఉన్నాయని సీఎస్‌ వెల్లడించారు. బ్యాటరీ యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు, మెరుగైన పారిశ్రామిక విధానం రాష్ట్రంలో అమల్లో ఉందని వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. భారీ బ్యాటరీ యూనిట్‌ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం  అనువైనదిగా పేర్కొన్న సీఎస్‌.. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్‌–ఐపాస్‌ ద్వారా అనుమతులు సులభతరంగా ఇస్తామన్నారు. బ్యాటరీ యూనిట్‌ ఏర్పాటు చేసే పక్షంలో భూమి, ఇతర మౌలిక సౌకర్యాలు, అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ‘ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పాలసీ’అమలవుతోందని, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దేశంలోనే అతిపెద్ద ‘ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌’ఉందని సీఎస్‌ వెల్లడించారు. 

2025 నాటికి ఎలక్ట్రానిక్‌ వాహనాలు..
భారీ లిథియం అయాన్‌ బ్యాటరీ యూనిట్‌ ఏర్పాటుకు తెలంగాణ ముందుకు రావడంపై నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ రాష్ట్రాన్ని అభినందించారు. దేశంలో ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో బ్యాటరీ యూనిట్లు నిర్మిస్తామన్నారు. 2023 నాటికి దేశంలోని అన్ని త్రిచక్ర వాహనాలు, 2025 నాటికి ద్విచక్ర వాహనాలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాలు పనిచేసేందుకు వీలుగా రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) సాఫ్ట్‌ లోన్లు, రూఫ్‌టాప్‌ ఇన్‌స్టలేషన్స్, మైక్రో గ్రిడ్లు తదితరాలను ప్రోత్సాహకాలుగా ఇస్తుందని అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. కాగా, ‘ట్రాన్‌ఫార్మేటివ్‌ మొబిలిటీ, స్మార్ట్‌ స్టోరేజ్‌’పై నీతి ఆయోగ్‌ సీఈఓ అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ‘ఇంటర్‌ మినిస్టీరియల్‌ స్టీరింగ్‌ కమిటీ’ని ఏర్పాటు చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement