జిల్లా పరిషత్ వార్షిక ప్రణాళిక సిద్ధమైంది.
సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ వార్షిక ప్రణాళిక సిద్ధమైంది. ఈ నెల 26న జరిగే జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) సమావేశంలో ప్రణాళికపై చర్చించి స్వల్పమార్పులు చేర్పులతో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వార్షిక ప్రణాళికలో భాగంగా 2014-15 సంవత్సరానికి బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్(బీఆర్‌జీఎఫ్) ప్రతిపాదనలు రూపొందించారు. రూ.27.81 కోట్లతో 2,674 పనులను ప్రతిపాదించారు. జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్ ఆధ్వర్యంలో జరిగే జిల్లా ప్రణాళిక సమావేశంలో బీఆర్‌జీఎఫ్ పనుల ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.
ప్రణాళికలో.. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, రహదారులు, తాగునీటి సరఫరా పనులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 11.18 కోట్లతో 1,151 పనులను ప్రతిపాదించారు. బీఆర్‌జీఎఫ్ ద్వారా ప్రతి ఏటా మార్చిలోగా ప్రణాళికను సిద్ధం చేసి డీపీసీలో చర్చించి ఆ తర్వాత నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపటం ఆనవాయితీ. బీఆర్‌జీఎఫ్ కింద పంచాయతీ పరిధిలో 50 శాతం, మండల పరిషత్ పరిధిలో 30 శాతం, జెడ్పీ స్థాయిలో 20 శాతం పనులను ప్రతిపాదిస్తారు.
ఈ ప్రాతిపదికన జనవరి-ఫిబ్రవరి మాసంలోనే ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ ఎన్నికలు రావటంతో ఆలస్యమైంది. తాజాగా జెడ్పీ పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో జెడ్పీ 20 శాతం పనుల ప్రతిపాదనల్లో కొత్త జెడ్పీటీసీ సభ్యులు స్వల్ప మార్పులు చేశారు. అనంతరం జెడ్పీ అధికారులు రూ.27.81 కోట్లతో పనులను ప్రతిపాదించారు.
బీఆర్‌జీఎఫ్ కింద గ్రామపంచాయతీ పరిధిలోని 50 శాతం కోటాలో రూ.11.59 కోట్లతో 1,771 పనులు, మండల పరిషత్ పరిధిలో 30 శాతం కోటాలో రూ.8.07 కోట్లతో 598 పనులు, జెడ్పీ పరిధిలో 20 శాతం కోటా కింద రూ.4.25 కోట్లతో 189 పనులు ప్రతిపాదించారు. వీటితోపాటు పట్టణ ప్రాంతాల్లో బీఆర్‌జీఎఫ్ పనులకు చేపట్టేందుకు రూ.3.88 కోట్లతో 116 పనులను ప్రతిపాదించారు. బీఆర్‌జీఎఫ్ పనులకు ప్రభుత్వం నిధులు విడుదల కేటాయించిన పక్షంలో గ్రామాల్లో త్వరలోనే అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది.