breaking news
The district planning committee
-
బీఆర్జీఎఫ్ ప్రణాళిక రెడీ
సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ వార్షిక ప్రణాళిక సిద్ధమైంది. ఈ నెల 26న జరిగే జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) సమావేశంలో ప్రణాళికపై చర్చించి స్వల్పమార్పులు చేర్పులతో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వార్షిక ప్రణాళికలో భాగంగా 2014-15 సంవత్సరానికి బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్(బీఆర్జీఎఫ్) ప్రతిపాదనలు రూపొందించారు. రూ.27.81 కోట్లతో 2,674 పనులను ప్రతిపాదించారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ ఆధ్వర్యంలో జరిగే జిల్లా ప్రణాళిక సమావేశంలో బీఆర్జీఎఫ్ పనుల ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ప్రణాళికలో.. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, రహదారులు, తాగునీటి సరఫరా పనులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 11.18 కోట్లతో 1,151 పనులను ప్రతిపాదించారు. బీఆర్జీఎఫ్ ద్వారా ప్రతి ఏటా మార్చిలోగా ప్రణాళికను సిద్ధం చేసి డీపీసీలో చర్చించి ఆ తర్వాత నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపటం ఆనవాయితీ. బీఆర్జీఎఫ్ కింద పంచాయతీ పరిధిలో 50 శాతం, మండల పరిషత్ పరిధిలో 30 శాతం, జెడ్పీ స్థాయిలో 20 శాతం పనులను ప్రతిపాదిస్తారు. ఈ ప్రాతిపదికన జనవరి-ఫిబ్రవరి మాసంలోనే ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ ఎన్నికలు రావటంతో ఆలస్యమైంది. తాజాగా జెడ్పీ పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో జెడ్పీ 20 శాతం పనుల ప్రతిపాదనల్లో కొత్త జెడ్పీటీసీ సభ్యులు స్వల్ప మార్పులు చేశారు. అనంతరం జెడ్పీ అధికారులు రూ.27.81 కోట్లతో పనులను ప్రతిపాదించారు. బీఆర్జీఎఫ్ కింద గ్రామపంచాయతీ పరిధిలోని 50 శాతం కోటాలో రూ.11.59 కోట్లతో 1,771 పనులు, మండల పరిషత్ పరిధిలో 30 శాతం కోటాలో రూ.8.07 కోట్లతో 598 పనులు, జెడ్పీ పరిధిలో 20 శాతం కోటా కింద రూ.4.25 కోట్లతో 189 పనులు ప్రతిపాదించారు. వీటితోపాటు పట్టణ ప్రాంతాల్లో బీఆర్జీఎఫ్ పనులకు చేపట్టేందుకు రూ.3.88 కోట్లతో 116 పనులను ప్రతిపాదించారు. బీఆర్జీఎఫ్ పనులకు ప్రభుత్వం నిధులు విడుదల కేటాయించిన పక్షంలో గ్రామాల్లో త్వరలోనే అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. -
బీఆర్జీఎఫ్ పథకానికి డీపీసీ గ్రహణం..!
జిల్లా పరిషత్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(బీఆర్జీఎఫ్) పథకంలో ఈఏడాది చేపట్టనున్న అభివృద్ధి పనులు సక్రమంగా సాగుతాయా లేదోననే అనుమానాలు సర్వత్రా వ్యక్త మవుతున్నాయి. గతంలో పనులను ప్రతిపాదించడంలో పాలకవర్గాల ప్రజాప్రతినిధులు ఇష్టారీతిన వ్యవహరించడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. పైగా ఈ దఫా కొత్త పాలక వర్గాలు కొలువుదీరినా కమిటీ నియామకం జాప్యం కానుంది. దీంతో అభివృద్ధి పనులపై అనుమానాలు కలుగుతున్నాయి. బీఆర్జీఎఫ్ పథకంలో చేపట్టే ప్రతీ పని జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) ఆమోదం పొందాల్సి ఉంటుంది. అనంతరం రాష్ట్ర హైపర్ కమిటీ పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కేంద్రం నిధులను మంజూరు చేస్తుంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన ఏర్పాటయ్యే డీపీసీలో 28 మంది సభ్యులు స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీలో ఉంటారు. 2007లో మొదటి సారిగా జిల్లాలో ఏర్పడిన డీపీసీ స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీ కాలం ముగిసిపోవడంతో 2011లో రద్దయింది. అప్పుడు స్థానిక సంస్థలు లేక పోవడం వల్ల కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక అధికారుల ఆమోదంతోనే మూడేళ్ల ప్రణాళికలు ఆమోదం పొందగా నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం పాలకవర్గాలు కొలువు దీరడంతో డీపీసీ ఏర్పాటు తప్పని సరిగా మారింది. రెండో విడత అమలు బీఆర్జిఎఫ్ పథకంలో 50 శాతం గ్రామ పంచాయతీలకు, 30 శాతం మండల పరిషత్‌లకు, 20 శాతం జిల్లా పరిషత్‌లతో పాటు అర్బన్ సంస్థలైన వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు, జనగామ మునిసిపాలటీకి నిధులను ప్రభుత్వం కేటాయిస్తున్నది. ఈ పథకం మొదటి విడతగా జిల్లాలో 2007 నుంచి 2012 వరకు అమలయ్యింది. సుమారు రూ.130కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. అవాసప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు ఈ నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధులు వారికి ఇష్టం ఉన్న పనులను ప్రతిపాదించడంతో కేంద్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఈ ఐదేళ్లలో రాలేదు. ఈవిషయాలను పరిశీలించిన హైపర్ కమిటీ రెండో విడత 2012 నుంచి 2017 వరకు ఈపథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు సిఫారసు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందుకుగాను ముందస్తు ప్రణాళికలను తయారు చేశారు. పాలకవర్గాలు లేని సమయంలో అధికారులు చేపట్టగా మిగిలిన పనులను పూర్తి చేయడానికి ఇప్పుడు అవకాశం లభించింది. అయితే ప్రస్తుతం మళ్లీ పాలకవర్గాలు కొలువుదీరాయి. పనుల ప్రతిపాదనల విషయంలో ప్రజాప్రతినిధులు ఇష్టారీతిన వ్యవహరించే అవకాశాలున్నాయని, నిధులు సక్రమంగా వినియోగమవుతాయో లేవోననే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఇప్పట్లో కమిటీ లేనట్టే..? గతంలో ఏర్పాటైన జిల్లా ప్రణాళిక కమిటీలో చైర్మన్‌గా జెడ్పీ చైర్పర్సన్, మెంబర్ సెక్రటరీగా జిల్లా కలెక్టర్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు 28 మంది సభ్యులున్నారు. ఇందులో సభ్యులు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్ల నుంచి ఎన్నికయ్యారు. జెడ్పీటీసీల నుంచి 20 మంది సభ్యులుండగా నగర కార్పొరేషన్ నుంచి ముగ్గురు, జనగామ ముని సిపాలటీ నుంచి ఒక్కరు ప్రాతినిధ్యం వహించారు. అభివృద్ధి పథకాలపై నిష్ణాతులైన నలుగురు సభ్యులను ప్రభుత్వం సిఫారసు చేసింది. ప్రస్తుతం వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగలేదు. జనగామకు అదనంగా మహబూబాబాద్, భూపాలపల్లి మునిసిపాలిటీలుగా ఏర్పడ్డాయి. పరకాల, నర్సంపేట నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. దీంతో డీపీసీలో ఎంత మంది సభ్యులుండాలన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయడంతోపాటు ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పట్లో ఈ కమిటీ ఎంపిక సాధ్యం కాదని తెలుస్తోంది. దీంతో ప్రణాళికల ఆమోదంపై ఉన్నతాధికారుల సూచనలను తీసుకోనున్నట్లు సమాచారం.