సీలు భద్రం..మందు మాయం

సీలు భద్రం..మందు మాయం


పెద్దపల్లి : ఫుల్‌బాటిల్ సీలు భద్రంగా ఉండగానే లోపల మద్యం మాయవుతోంది. ఇదేదో విఠలాచార్య సినిమాలో సన్నివేశం కాదు. పెద్దపల్లి ప్రాంతంలోని వైన్సుల్లో జరుగుతున్న దందా. సీల్ ఉన్న బాటిల్లోని మందును మాయం చేసి అందులో నీళ్లు నింపుతూ కల్తీ చేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. పట్టణానికి చిందం రమేశ్, ఆవునూరి రమేశ్ అనే యువకులు సీసాకు సీల్ ఉండగానే చాకచక్యంగా తొలగించడంలో నేర్పరులు.



వీరి నేర్పరితనాన్ని మద్యం దుకాణాల యజమానులు తమ కల్తీ దందాకు ఉపయోగించుకుంటున్నారు. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని వైష్ణవి 123 నంబర్ గల మద్యం దుకాణం వెనకాల శనివారం వేకువజామున ఈ ఇద్దరు యువకులు మద్యం బాటిళ్ల మూతలు చాకచక్యంగా తీస్తున్నారు. ఒక్కో బాటిల్‌లోంచి 25 శాతం మద్యం తీస్తూ అక్కడే బకెట్లలో ఉన్న నీళ్లను నింపుతూ మళ్లీ యథావిధిగా మూత బిగిస్తున్నారు.



అదే సమయంలో కరీంనగర్‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై పి.వెంకట్ తన బృందంతో దాడి చేశారు. రూ.15 వేల విలువైన మద్యం సీసాలు, నీళ్ల బకెట్లు, సేకరించిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం దుకాణాన్ని సీజ్ చేసి యజమాని మహేశ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

 

‘ఎక్సైజ్’పై అనుమానాలు

పెద్దపల్లిలో చాలాకాలంగా మద్యం కల్తీ అవుతోందని మద్యప్రాన ప్రియులు గగ్గోలు పెడుతున్నప్పటికీ స్థానికంగా ఎలాంటి ఆధారాలు చిక్కకపోవడంతో ఎవరికి వారే మిన్నకుంటున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి మద్యం కొనుక్కుంటున్న పలువురు కల్తీ అవుతోందని వైన్‌షాప్ నిర్వాహకులతో గొడవకు దిగిన సందర్భాలున్నాయి. అక్రమ దందాను స్థానిక ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.



దీంతో ఆధారాల కోసం పట్టణంలో మద్యం వ్యాపారులపై నిఘా వేసినవారే స్థానిక అధికారులను నమ్మకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఉప్పందించినట్లు సమాచారం. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది రంగంలోకి దిగి మద్యం కల్తీ చేస్తున్నవారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.



కాగా, పట్టుకున్న బాటిళ్లు ఖరీదైనవి కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దాడుల్లో ఆఫీసర్స్ చాయిస్, ఎంసీ బాటిళ్లు లభ్యమైనట్లు అధికారులు ప్రకటించారు. పెద్దగా ఖరీదు కాని ఈ మద్యాన్ని కల్తీ చేస్తే ఒరిగేదేమి ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులే వ్యూహాత్మకంగా వ్యవహరించి కేసు ప్రాధాన్యతను తగ్గించే దిశగా చవక మద్యం బాటిళ్లను కల్తీ చేస్తున్నట్లుగా చూపించినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

స్టాక్ దిగిన రాత్రే మూతలు మాయం

మద్యం దుకాణాల్లోకి స్టాక్ దిగిన రాత్రే మూత ల తొలగింపు నిపుణులు అక్కడకు చేరుకుని మూతలు తొలగించి ఒక్కో బాటిల్‌లో పావలా వంతు మద్యం తీసి నీళ్లెక్కిస్తున్నారు. ఇలా యజమానులు ఒక్కో బాటిల్‌పై రూ.200 చొప్పున అదనపు లాభం గడిస్తున్నారు. గతేడాది శాంతినగర్ సమీపంలోని మద్యం దుకాణంలో ఖరీదైన మద్యం బాటిళ్లలో రంగునీళ్ల గుడుంబా కలిపి సీల్ వేస్తుండగా ఎక్సైజ్ అధికారులు వలపన్ని పట్టుకోగా, సదరు షాప్ లెసైన్సును రద్దు చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అంతకుముందు బ్రాహ్మణపల్లిలో నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి ప్రాంతంలో మద్యం కల్తీపై మద్యపాన ప్రియులు ఆందోళన చెందుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top