తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేశారు.
భువనగిరి (నల్లగొండ జిల్లా): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేశారు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని భువనగిరి మండలం రాయగిరిలో వచ్చే నెల 3న జరిగే కార్యక్రమానికి అధికారులు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించారు. రాయగిరిలోని ఆటవీశాఖకు చెందిన 489 సర్వే నంబర్‌లోగల ప్రభుత్వ భూమిలో హరితహారం ప్రారంభించనున్నారు.
సురేంద్రపురి ఎదురుగా గల గుట్టలపై ఉన్న చదునైన స్థలంలో రాష్ర్టపతి, గవర్నర్, సీఎం మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 5 నుంచి 10 ఎకరాల ఆటవీ విస్తీర్ణంలో సుమారు 5 వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇప్పటికే కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్, భువనగిరి ఆర్డీవో ఎన్. మధుసూదన్‌లు మొక్కలు నాటే స్థలాన్ని మంగళవారం పరిశీలించగా.. బుధవారం కూడా పలువురు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్రపతితో శిలాఫలకం ప్రారంభించేందుకు పనులు కూడా ప్రారంభించారు.