
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదటికొచ్చింది. తప్పుల తడకగా రూపొందించిన జాబితాను మళ్లీ సవరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పంచాయతీ అధికారుల నిర్వాకంతో జాబితా ల్లో భారీగా తప్పులు దొర్లినట్లు ఈసీ గుర్తించింది. దీంతో 9 జిల్లాల్లో తిరిగి ముసాయిదా జాబితా ప్రచురించాలని ఆదేశించింది. మంగళవారం ఈ మేరకు 9 జిల్లాల్లోని 282 గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల ముసాయిదా జాబితాను యంత్రాంగం ప్రదర్శించింది.
అసెంబ్లీ ఓటర్ల జాబితాను పంచాయతీలకు అనుగుణంగా మలుచుకునే క్రమంలో పొరపాట్లు జరిగినట్లు అంచనాకొచ్చిన కలెక్టర్లు.. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో కూడా భారీగా తప్పులు జరిగినట్లు ఫిర్యాదులందాయి. కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో కాకుండా ఒకేవార్డులో ఉండేలా జాబితాలను సవరించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏప్రిల్ 30న ముసాయిదా జాబితాను ప్రకటించింది. వీటిలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది.
అదేనెల 17న తుది జాబితాను కూడా ప్రచురించింది. దీనికి అనుగుణంగా బీసీ ఓటర్ల గణన కూడా పూర్తిచేసింది. ఓటర్ల జాబితా సవరణలో తప్పిదాలు జరిగినట్లు తేలడంతో జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ గ్రామీణ జిల్లాల్లోని 55 మండలాల్లో తిరిగి జాబితా సవరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ జిల్లాల్లో జాబితా సవరణ తర్వాతే రిజర్వేషన్ల ఖరారుపై ముందుకు కదలాలని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కారణాలెన్నో..?
ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడానికి పంచాయతీ విస్తరణాధికారులు, కార్యదర్శులపై పని ఒత్తిడి కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. రైతుబంధు పథకంలో తలమునకలు కావడం, ఇతరత్రా రోజువారీ విధుల నిర్వహణలో బిజీగా ఉండటం ఓటర్ల జాబితా సవరణపై ప్రభావం పడింది. గతంలో ఎన్‌ఐసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఓటర్ల జాబితాలను రూపొందించారు. ప్రస్తుతం ఈ విధానానికి ఈసీ ఫుల్‌స్టాప్ పెట్టి టీఈ–పోల్ పేరిట కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఓటర్ జాబితాల్లో మార్పులు, చేర్పులు చేపట్టింది.
ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే అధికారం (లాగిన్) ఎంపీడీఓ, డీపీఓలకు మాత్రమే ఉండటంతో అభ్యంతరాల సవరణ సకాలంలో జరగలేదు. ఇది కూడా మరోసారి జాబితా సవరణకు దారితీసింది. ఓటర్ల జాబితా సవరించే మండలాల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 18 మండలాల్లో తప్పులు దొర్లినట్లు ఈసీకిచ్చిన నివేదికలో జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. జగిత్యాల జిల్లాలో 6, భూపాలపల్లి 1, మహబూబ్‌నగర్ 8, రంగారెడ్డి 11, వికారాబాద్ 5, కరీంనగర్ 1, సిరిసిల్ల 3, వరంగల్ రూరల్ 2 మండలాల్లో సవరణ జరగనుంది.
తాజా జాబితా సవరణ ఇలా..
♦ జూన్ 5న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శన
♦ 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
♦ 6న జిల్లాస్థాయిలో రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం
♦ 6 వరకు అభ్యంతరాల స్వీకరణ
♦ 7న అభ్యంతరాల పరిష్కారం
♦ 8న ఓటర్ల తుది జాబితా ప్రకటన