Voter listing editing
-
ఓటర్ల సవరణ గడువు కుదింపుపై ‘పిల్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ గడువును తగ్గించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్ర యోజన వ్యాజ్యం దాఖలైంది. అక్టోబర్ లేదా నవంబర్ మాసాల్లో ఎన్నికలు జరపాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల అధికారులపై ఒత్తిడి చేసిన కారణంగా ఓటర్ల జాబితా సవరణ గడువును కుదించారంటూ న్యాయవాది కొమ్మిరెడ్డి కృష్ణ విజయ్ అజాద్ ‘పిల్’వేశారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర న్యాయశాఖ, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అధికారులతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను ప్రతివాదులుగా చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించనుంది. ఓటర్ల జాబితాల సవరణకు 2019 జనవరి వరకూ గడువు ఉంటే 2018 జనవరి నాటికి తగ్గించేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ నెల 8న నోటిఫికేషన్ ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో 2.81 కోట్ల ఓటర్లు ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ 1న వెల్లడించిన ముసాయిదా జాబితాలో 21 లక్షల ఓట్లు తగ్గి పోయాయన్నారు. -
సవరణ ‘పంచాయితీ’!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదటికొచ్చింది. తప్పుల తడకగా రూపొందించిన జాబితాను మళ్లీ సవరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పంచాయతీ అధికారుల నిర్వాకంతో జాబితా ల్లో భారీగా తప్పులు దొర్లినట్లు ఈసీ గుర్తించింది. దీంతో 9 జిల్లాల్లో తిరిగి ముసాయిదా జాబితా ప్రచురించాలని ఆదేశించింది. మంగళవారం ఈ మేరకు 9 జిల్లాల్లోని 282 గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల ముసాయిదా జాబితాను యంత్రాంగం ప్రదర్శించింది. అసెంబ్లీ ఓటర్ల జాబితాను పంచాయతీలకు అనుగుణంగా మలుచుకునే క్రమంలో పొరపాట్లు జరిగినట్లు అంచనాకొచ్చిన కలెక్టర్లు.. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో కూడా భారీగా తప్పులు జరిగినట్లు ఫిర్యాదులందాయి. కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో కాకుండా ఒకేవార్డులో ఉండేలా జాబితాలను సవరించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏప్రిల్ 30న ముసాయిదా జాబితాను ప్రకటించింది. వీటిలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. అదేనెల 17న తుది జాబితాను కూడా ప్రచురించింది. దీనికి అనుగుణంగా బీసీ ఓటర్ల గణన కూడా పూర్తిచేసింది. ఓటర్ల జాబితా సవరణలో తప్పిదాలు జరిగినట్లు తేలడంతో జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ గ్రామీణ జిల్లాల్లోని 55 మండలాల్లో తిరిగి జాబితా సవరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ జిల్లాల్లో జాబితా సవరణ తర్వాతే రిజర్వేషన్ల ఖరారుపై ముందుకు కదలాలని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కారణాలెన్నో..? ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడానికి పంచాయతీ విస్తరణాధికారులు, కార్యదర్శులపై పని ఒత్తిడి కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. రైతుబంధు పథకంలో తలమునకలు కావడం, ఇతరత్రా రోజువారీ విధుల నిర్వహణలో బిజీగా ఉండటం ఓటర్ల జాబితా సవరణపై ప్రభావం పడింది. గతంలో ఎన్ఐసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఓటర్ల జాబితాలను రూపొందించారు. ప్రస్తుతం ఈ విధానానికి ఈసీ ఫుల్స్టాప్ పెట్టి టీఈ–పోల్ పేరిట కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఓటర్ జాబితాల్లో మార్పులు, చేర్పులు చేపట్టింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే అధికారం (లాగిన్) ఎంపీడీఓ, డీపీఓలకు మాత్రమే ఉండటంతో అభ్యంతరాల సవరణ సకాలంలో జరగలేదు. ఇది కూడా మరోసారి జాబితా సవరణకు దారితీసింది. ఓటర్ల జాబితా సవరించే మండలాల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 18 మండలాల్లో తప్పులు దొర్లినట్లు ఈసీకిచ్చిన నివేదికలో జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. జగిత్యాల జిల్లాలో 6, భూపాలపల్లి 1, మహబూబ్‌నగర్ 8, రంగారెడ్డి 11, వికారాబాద్ 5, కరీంనగర్ 1, సిరిసిల్ల 3, వరంగల్ రూరల్ 2 మండలాల్లో సవరణ జరగనుంది. తాజా జాబితా సవరణ ఇలా.. ♦ జూన్ 5న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శన ♦ 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ♦ 6న జిల్లాస్థాయిలో రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం ♦ 6 వరకు అభ్యంతరాల స్వీకరణ ♦ 7న అభ్యంతరాల పరిష్కారం ♦ 8న ఓటర్ల తుది జాబితా ప్రకటన -
పాపం వీఆర్వోలు.. !
హన్మకొండ అర్బన్ : సుమారు 10 రోజుల క్రితం మొదలైన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో వీఆర్వోలకు ఊపిరి సల్పకుండా అయింది. ఉదయం 8 గంటలకు గ్రామ సభలతో మొదలైతే సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి చేరేసరికి రాత్రి పొద్దుపోతుంది. పదిరోజుల పాటు విరా మం లేకుండా ఉన్న తమకు ఆదివారం కాస్త సెలవు దొరికిందనుకుంటే ఓట్ల జాబితా సవరణ పేరుతో ఆదివారం కూడా హన్మకొండ మండలంలోని వీఆర్వోలను అధికారులు కార్యాలయానికి పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో హన్మకొండ, వరంగల్ కాజీపేట మండలాల పరిధిలోని వారు ఉదయం 9 గంటలకే కలెక్టరేట్ చేరుకున్నారు. కనీసం ఆదివారం కూడా వదలకుండా విధుల్లో ఉంచితే ఇక తమ కుటుంబం, ఇంటిపనుల చేసుకునేదెలా అని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ముసాయిదా ఓటరు జాబితా రెడీ
నల్లగొండ: ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం ప్రకటించారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా... దాంట్లో నల్లగొండ మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో ఓటరు నమోదు కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభించారు. ఐదు నియోజకవర్గాల్లో పురుషులు, మహిళలు కలిపి 9,30,918 మంది ఉన్నారు. దీంట్లో పురుషులు 4,68,974, మహిళలు 4,61,921, ఇతరులు 23 మంది ఉన్నారు. కొత్త దరఖాస్తులు తహసీల్దారు కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల్లో స్వీకరిస్తారు. ఓటరు నమోదుకు సంబంధించిన దరఖాస్తులు, ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు పైన తెలిపిన అన్ని కార్యాలయాల్లో తీసుకుంటారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 4,11 తేదీల్లో గ్రామ, పట్టణాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి ముసాయిదా జాబితాను చదివి వినిపిస్తారు. ఈ నెల 7, 14 తేదీల్లో బూత్ స్థాయి అధికారి, రాజకీయ పార్టీల ద్వారా నియమించిన బూత్‌స్థాయి ఏజెంట్ల ద్వారా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. దరఖాస్తులు, అభ్యంతరాల పైన ఈ నెల 31న విచారిస్తారు. విచారించిన దరఖాస్తులను జూన్ 9న కంప్యూటరీకరిస్తారు. జూన్15న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. వీరిని తొలగిస్తారు.. చనిపోయిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు శాశ్వతంగా నివాసం వదిలి వెళ్లిన (వలసలు) వారి పేర్లు, రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన వారిని జాబితా నుంచి తొలగిస్తారు. ఓటరు నమోదు చేసుకునే వారు పైన తెలిపిన కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చును. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు .. ఆరు నియోజకవర్గాలకు ఓటరు నమోదు ప్రత్యేక అధికారులుగా ఎన్నికల సంఘం నియమించింది. మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాలకు ఆర్డీఓలు, మునుగోడు వి.చంద్రశేఖర్ రెడ్డి (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్), నకిరేకల్‌కు జెడ్పీ సీఈఓ హనుమానాయక్‌ను నియమించారు. నల్లగొండలో మాత్రం ప్రత్యేకంగా ఇంటింటి సర్వే నిర్వహించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమం చేపడతారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ప్రత్యేక షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్: ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు, ఓటర్లు తమ పేర్లున నమోదు చేసుకునేందుకు, మార్చుకునేందుకు, ఏదైనా సమాచారాన్ని తెలిపేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబరు 18004251442 ఏర్పాటు చేశారు.