సినిమా, సాహిత్యం పరస్పర ప్రభావితాలే

Adoor Gopalakrishnan Speaks About Literary Festival At Hyderabad - Sakshi

మలయాళ సినీ దర్శకుడు, రచయిత ఆదూర్‌ గోపాలకృష్ణన్‌

కన్నుల పండువగా ప్రారంభమైన హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌

ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్న ఆస్ట్రేలియా దేశ కాన్సుల్‌ జనరల్‌ సుసాస్‌ గ్రేస్‌

సాక్షి, హైదరాబాద్‌: సాహిత్యం సినిమాలపైన ప్రభావం చూపించినట్లుగానే వాటిపై సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయని ప్రముఖ మలయాళ సినీ దర్శకుడు, రచయిత, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత ఆదూర్‌ గోపాల కృష్ణన్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ విద్యారణ్య స్కూల్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సారి వేడుకలకు అతిథి దేశంగా పాల్గొన్న ఆస్ట్రేలియా ప్రతినిధిగా చెన్నైలోని ఆ దేశ కాన్సుల్‌ జనరల్‌ సుసాస్‌ గ్రేస్‌ మరో అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదూర్‌ గోపాల కృష్ణన్‌ మాట్లాడుతూ..‘సాధారణంగా సాహిత్యంనుంచి సినిమాలు రూపొందుతాయి. నవల,కథా సాహిత్యం ఇందుకు దోహదం చేస్తుంది. సమాజంలోని విభిన్న దృక్కోణాల నుంచి వెలువడే సాహిత్యం ఆధారంగానే సినిమాలు రూపొందినట్లుగానే సినిమాల నుంచి కూడా సాహిత్యం వస్తుంది.’అని అన్నారు.

దురదృష్టవశాత్తు ప్రస్తుతం మంచి సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయని, అధికం హోటల్‌ గదుల్లోనే తయారవుతున్నాయని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.సినిమాలు నిజ జీవితాన్ని ప్రతిబింబించడం లేదన్నారు. ‘ఎలిపఠాయం’, ‘సప్తపది’వంటి గొప్ప చిత్రాలను రూపొందించిన ఆదూర్‌ తన సినీ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

గొప్ప సాంస్కృతిక చరిత్ర భారత్‌ సొంతం...
ఆస్ట్రేలియా కాన్సుల్‌ జనరల్‌ సుసాన్‌ మాట్లాడుతూ, తాను భారతదేశ చరిత్ర, సాహిత్యం, సాంస్కృతిక వైవిధ్యాన్ని వివిధ రచనల ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. 20 ఏళ్లుగా తాను ఇండియాలో ఉంటున్నప్పటికీ పుస్తకాల ద్వారానే ఎక్కువ విషయాలు తెలుసుకోగలిగినట్లు చెప్పా రు. అరుంధతీరాయ్‌ ‘ది గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌’, విక్రమ్‌సేద్‌ ‘ది సూటబుల్‌ బాయ్‌’వంటి పుస్తకాలు తనను ప్రభావితం చేశాయన్నారు. ఆస్ట్రేలియాలో చెలరేగుతున్న కార్చి చ్చు వల్ల తాము నష్టపోతున్నట్లు ఆమె విచారం వ్యక్తం చేశారు.

తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ అండమాన్‌ జైలు తరహాలో ఒకప్పుడు ఖైదీలకు .జైలు శిక్ష విధించే కారాగారంగా ఉన్న ఆస్ట్రేలియా ఒక గొప్ప దేశంగా ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ టి. విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు ప్రపంచానికి విషాదకరమన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top