కరోనానూ క్యాష్‌..

4500 Cases File on General Stores in Lockdown Time Hyderabad - Sakshi

లాక్‌డౌన్‌ నేపథ్యంలో లాభార్జనే ధ్యేయంగా దందాలు

133 ఎఫ్‌ఐఆర్‌లు,4,500కు పైగా కేసులు నమోదు

సాక్షి, సిటీబ్యూరో: కరోనా నిరోధానికి అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనేకమంది పేదలు, దిగువ మధ్య తరగతి వారు ఉపాధి కోల్పోయారు. దీన్ని గమనించిన నగరవాసులు మానవత్వం చాటుకుంటూ స్పందించారు. నిత్యావసరాలు, అనునిత్యం ఆహారం, ఇతర ఆవశ్యక వస్తువులు పంపిణీ చేశారు. ఇలా స్పందించిన వారిలో సిటీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులూ ఉన్నారు. అయితే కొందరు వ్యాపారులు మాత్రం లాభార్జనే ధ్యేయంగా తమ దందాలు కొనసాగించారు. ఈ విషయంలో బడా బడా దుకాణాలు సైతం అతీతం కాదు. ఈ వ్యవహారాలను పరిగణనలోకి తీసుకున్న సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అనునిత్యం నిఘా ఉంచి, అక్రమాలు పాల్పడుతున్న దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఫలితంగా 57 రోజుల కాలంలో 133 ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్‌ కాగా..4,500లకు పైగా పెట్టీ కేసులు నమోదయ్యాయి.

ఎవరికి వారు రేట్లు పెంచేసి...
లాక్‌డౌన్‌ నుంచి నిత్యావసర వస్తువుల రవాణా, విక్రయాలపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు, నిషేధం విధించలేదు. అయితే ఉత్పత్తి తగ్గడంతో సరఫరాకు అనేక ఇబ్బందులు వచ్చాయి. ఫలితంగా నిత్యావసర వస్తువులకు కొన్ని రోజులు భారీ డిమాండ్‌ వచ్చింది. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి కొందరు వ్యాపారులు మానవత్వాన్ని సైతం మరిచిపోయారు. తమ వద్ద ఉన్న వస్తువుల్ని నల్లబజారుకు తరలించడం, కృత్రిమ కొరత సష్టించడం ద్వారా వాటి రేట్లు భారీగా పెంచేసి విక్రయించడం వంటివి చేశారు. ఈ విషయంలో చిన్న చిన్న కిరాణా దుకాణాలే కాదు..పెద్దపెద్ద సూపర్‌మార్కెట్స్‌ సైతం అతీతం కాదని నిరూపించాయి. మరికొన్ని దుకాణాలు, సూపర్‌మార్కెట్స్‌లో కస్టమర్లు భౌతికదూరం పాటించకపోయినా పట్టించుకోకపోవడం, శానిటైజర్లు వంటిని ఏర్పాటు చేయకపోవడం వంటివీ చోటు చేసుకున్నాయి. ప్రధానంగా నగరవాసుల్ని ఇబ్బందిపెట్టిన అంశం ఎమ్మార్పీ కంటే రేట్లు పెంచి అమ్మకాలు జరపడం అని పోలీసులు చెప్తున్నారు. 

మాంసం దుకాణాల్లోనూ అక్రమాలు..
నగరంలోని కరోనా విస్తరించిన తర్వాత కొన్నాళ్లు గుడ్లు, మాంసం విక్రయాలు నిలిచిపోయాయి. ఫలితంగా వాటి రేట్లు దారుణంగా పడిపోయాయి. వీటి వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతుందనే ప్రకటనల ఫలితంగా ఈ పరిస్థితులు తలెత్తాయి. అయితే వీటిపై స్పందించిన ప్రభుత్వం వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యే చర్యలు తీసుకుంది. కొరోన వైరస్‌ను తట్టుకోవాలంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరగాలని దాని కోసం గుడ్లు, మాంసం తినాలంటూ ప్రచారం చేసింది. దీంతో వాటి అమ్మకాలు పెరిగి రేట్లు సాధారణ స్థితికి వచ్చాయి. వీటిని విక్రయించే దుకాణాలు సైతం కొన్ని తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. నిల్వ ఉన్న, పాక్షికంగా పాడైన మాంసం విక్రయించడం, ఇతర జంతువుల మాంసాన్ని మటన్‌ పేరు చెప్ప అమ్మడం చేశాయి. ఈ విషయాన్నీ నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తీవ్రంగా తీసుకుని నిఘా, దాడులు చేశారు. ఈ వ్యాపారుల తీరు ఇలా ఉంటే అనేక మంది నగర వాసులు లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉంటూ పేకాట ప్రారంభించారు. ఇలాంటి అనధికారిక శిబిరాలపైనా దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఉదంతం తీవ్రతను బట్టి కేసులు...
వ్యాపారులు చేసిన ఈ దందాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అనునిత్యం దాడులు నిర్వహించారు. వీటిలో చిక్కిన వ్యాపారులు చేసిన దందా తీవ్రతను బట్టి చర్యలు తీసుకున్నారు. సాధారణ, ప్రజల ఆరోగ్యానికి హాని జరగని విషయాల్లో పెట్టీ కేసులు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వాటితో పాటు తీవ్రమైన అంశాలను సీరియస్‌గా తీసుకున్నారు. ఆయా దుకాణాలు, సూపర్‌మార్కెట్స్, వ్యాపారులపై స్థానిక పోలీసుస్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించారు. వీటిలో ఇలా రిజిస్టర్‌ అయిన కేసు ల్లో అత్యధికం నిత్యావసర వస్తువుల చట్టం (ఈసీ యాక్ట్‌), డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం నమోదు చేశారు. న్యాయస్థానాలు పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభమైన తర్వాత వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేయనున్నారు. ఆపై నిందితులకు నోటీసులు జారీ చేసి కోర్టుల్లో హాజరుపరుస్తామని పోలీసులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top